×
Ad

ఏపీలో స్థానిక, మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు? ఏం జరుగుతోంది?

కూటమి పార్టీలు ఉమ్మడిగా వస్తే వారిని తట్టుకుని నిలవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది.

  • ప్రిపరేషన్స్‌లో ఈసీ.. దూకుడు మీద కూటమి..
  • లోకల్‌ ఫైట్‌, పురపోరుకు కూటమి సిద్ధం, సంసిద్ధం!
  • స్థానిక ఎన్నికల యుద్ధానికి వైసీపీ దగ్గరున్న అస్త్రాలేంటి?

Local Elections: స్థానిక పోరు, మున్సిపల్ ఎన్నికలపై ఏపీలో ఇప్పటినుంచే రాజకీయ వేడి రాజుకుంటోంది. లోకల్ బాడీస్‌, మున్సిపాలిటీల గడువు దగ్గర పడుతుంది. దీంతో స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ అవుతోంది. ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది.

మార్చిలో..కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది. అందుకు తగ్గట్లుగానే స్టేట్‌ ఎలక్షన్ కమిషన్ అరేంజ్‌మెంట్స్‌ను స్పీడప్ చేసింది. మార్చిలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ అయిపోయాక మొదట మున్సిపల్ ఎన్నికలకు..ఆ తర్వాత కొంత సమయం తీసుకుని సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. దీంతో ఏపీ రాజకీయ వేడి రాజుకుంటోంది. గ్రామాల్లో ఎలక్షన్ హీట్‌ స్టార్ట్ అయింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తు మొదలెట్టింది. గత ఏడాది నుంచే ఏర్పాట్లలో బిజీ అయిపోయింది. అయితే జనగణన అడ్డంకిగా ఒకటి ఉందని ఆ మధ్య ప్రచారం జరిగింది. దాంతో ఎన్నికలు ఈ ఏడాది ఉండవేమో అని అనుకున్నారు. అయితే 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 దాకా జనగణన ఉంటుందని అధికారులు ప్రకటించారు.

Also Read: “గ్రేటర్‌” విలీనం, విభజన కొత్త సమస్యలకు దారితీసిందా?

దాంతో స్థానిక ఎన్నికలు ముందుకు వచ్చాయి. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిపించాలని చూస్తున్నారట. మార్చి 9లోగా కార్పోరేషన్లు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు చెందిన ఓటర్ల తుది జాబితాను ఫోటోలతో సహా రిలీజ్ చేయాలని ఎన్నికల సంఘం జిల్లాల అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత ఓటర్ల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల తేదీని ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

ఎన్నికలు జరిపించాలని విజ్ఞప్తులు
టీడీపీ 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించలేదు. అనేక కారణాలతో జాప్యం జరిగింది. చివరికి ఎన్నికల ముందు ఎందుకు అనుకుని వాయిదా వేశారు. అయితే ఈ సారి అధికారంలో కూటమి మాత్రమే లేదు, జనసేన బీజేపీ కూడా ఉన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని వారంతా కోరుతున్నారు.

ఎన్నికలు జరిగితే ద్వితీయ తృతీయ శ్రేణి నేతలకు స్థానికంగా పదవులు దక్కుతాయని అంటున్నారు. దాంతో చాలాకాలంగా ఈ ఎన్నికల కోసం అంతా వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు పెట్టి తీరాలన్న భావన కూటమి పెద్దల్లో వ్యక్తం అవుతోందట. అయితే ముందుగా కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు పెట్టి..ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో సర్కార్ ఉందంటున్నారు. ఆ నిర్ణయం వెనక కూటమి పెద్దల వ్యూహం ఉందని కూడా చర్చ జరుగుతోంది.

పట్టణాలలో వైసీపీకి బలం తక్కువ
పట్టణాలలో మొదటి నుంచి వైసీపీకి కొంత బలం తక్కువగా ఉంటుంది. పైగా కూటమి పార్టీలకు అనుకూలంగా ఓటర్లు ఉంటారని అంటుంటారు. దాంతో పట్టణాల నుంచే పల్లెల వైపుగా స్థానిక ఎన్నికల యుద్ధాన్ని తీసుకెళ్లాలని కూటమి పెద్దలు ఆలోచన చేస్తున్నారట. కూటమి పటిష్టంగా ఉంది. పైగా విద్యావంతులు తటస్థులు ఇలా విభిన్న వర్గాలు పట్టణాల్లో తమకు అనుకూలంగా ఉంటారని భావిస్తున్నారట. అయితే స్థానిక ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలు పెడితే వైసీపీకి అసలైన రాజకీయ యుద్ధంగానే ఉంటుందని అంటున్నారు.

కూటమి పార్టీలు ఉమ్మడిగా వస్తే వారిని తట్టుకుని నిలవాల్సిన అవసరం వైసీపీకి ఎంతైనా ఉంది. వైసీపీ ధీటైన వ్యూహాలను రచించి..బలమైన అభ్యర్థులను బరిలోకి నిలబెట్టకపోతే ఇబ్బంది తప్పదన్న చర్చ జరుగుతోందట. అయితే అధికారంలో ఏ పార్టీ ఉంటే..స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకే అనుకూలంగా ఫలితాలు వస్తుంటాయి. అయినా సరే తమ ఉనికి కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత విపక్షంపైన ఉంటుంది. ఎంతో కొంత తమ సత్తా చాటి తమ బలం పెంచుకోవాల్సి ఉంటుంది. కూటమితో అమీతుమీ తేల్చుకునేందుకు వైసీపీ సై అంటుందో లేక ఎన్నికలను లైట్ తీసుకుంటుందో వేచి చూడాలి.