Andhra Pradesh : ఏపీలో ఇటీవల విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన వివాదం ముగియకుండానే వైసీపీ ప్రభుత్వం మరో పేరు మార్పు వివాదాన్ని తెరపైకి తెచ్చింది. విజయనగరంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన విజయనగరం జిల్లా మహారాజా ఆస్పత్రి పేరును కూడా మార్చేసింది. మహారాజా జిల్లా కేంద్ర ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మార్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విజయనగరం జిల్లా వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.
రాత్రికి రాత్రే పాత బోర్డు తొలగించేసి కొత్త బోర్డును పెట్టేసింది. ఆస్పత్రి పేరు మార్పుపై స్థానికులు నిర్ఘాంత పోయారు. అభివృద్ధి పనులు చేయటం చేతకాకు జగన్ ప్రభుత్వం ఇటువంటి పిచ్చి పనులకు పూనుకుంటోందంటూ ఎద్దేవా చేస్తున్నారు. కొత్తగా పెట్టిన పేరు తీసివేసి పాతపేరుతోనే ఆస్పత్రిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాజా పేరు తీసివేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన మహారాజా ఆస్పత్రి పేరు మార్చటం ఏంటీ అంటూ జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
మహరాజా కేంద్ర ఆసుపత్రి పేరుకు బదులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా బోర్డు దర్శనమిచ్చింది. ఉదయం ఆస్పత్రికి వెళ్లిన రోగులు, ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే బోర్డు మార్చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హేయమైనంటూ విమర్శించారు. ఆస్పత్రి పేరు మార్పుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైకాపా ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఎంతో సేవ చేసిన మహారాజా రాజవంశాన్ని అవమానించేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. కొత్త పేరును తీసి వేసి పాత పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి
కాగా..ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. టీడీపీతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. తీవ్రంగా దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం సరైనదేనని సమర్థించుకుంది. ఈ వివాదం సద్దుమణుతున్న సమయంలో తాజాగా, మహారాజా ఆస్పత్రి పేరు మార్పు మరో వివాదానికి దారితీసింది.
విజయనగరం ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. సీఎం జగన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది.ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల పేర్లు మార్చటం తప్ప మరేమీ చేతకాని ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. మహనీయుల పేర్లు మార్చి జగన్ రాక్షసానందం పొందుతున్నారు మండిడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేసారు. నేడు విజయనగరంలో ఉన్న మహారాజ ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారంటూ మండిపడ్డారు. అంతే కాదు తమ విలువైన భూమి ఆస్పత్రికి ఇస్తే మహారాజా పేరు తొలగిస్తారా? అంటూ ప్రశ్నించారు. మహారాజా కుటుంబం అప్పుడు ప్రజల సంక్షేమం కోసం నిర్మించతలపెట్టిన ఆసుపత్రికి విలువైన భూమిని ఇచ్చేసిందని లోకేష్ తన ట్వీట్ లో గుర్తు చేశారు.