AOB Encounter
AOB Encounter : మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మంగళవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఆ పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరిన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మోస్ట్ వాంటెడ్ మద్వి హిడ్మా భద్రత బలగాలతో జరిగిన ఎదురుకాల్పల్లో హతమైన విషయం తెలిసిందే. హిడ్మాతోపాటు అతని భార్య మడకం రాజేతోపాటు మరో నలుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా.. బుధవారం ఉదయం ఏవోబీలో మరో ఎన్ కౌంటర్ జరిగింది.
బుధవారం ఉదయం మారేడుమల్లి ఏజెన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో దేవ్ జీ, ఆజాద్, జోకారావులతోపాటు మరో నలుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. ఏవోబీ ఎన్‌కౌంటర్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జి మృతి చెందాడు. తిరుపతి లొంగిపోవాలంటూ ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కోరుట్ల అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి 1983లో డిగ్రీ చదువుతున్న క్రమంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో చేరాడు. ఏబీవీపీ, ఆర్ఎస్‌యూ విద్యార్థి సంఘాల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో పోలీసు కేసులు నమోదు చేశారు. దీంతో 1983 చివరిలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దళ సభ్యుడి స్థాయి నుంచి కమాండర్‌గా పనిచేసి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కార్యదర్శిగా తిరుపతి కొనసాగుతున్నాడు.
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో తిప్పిరి తిరుపతిని దేవ్‌జీ గా పిలుస్తారు. మిలిషియా దాడులు జరిపి నిమిషాల్లో అక్కడి నుంచి తప్పించుకోవడం తిరుపతికి వెన్నతో పెట్టిన విద్య. తిరుపతి సమీపంలోని అలిపిరిలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి ఘటనలో నంబాల కేశవ రావుతోపాటు తిప్పిరి తిరుపతి పాత్ర ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
2010లో దంతెవాడ సమీపంలో సెంట్రల్ రిజర్వ్ జవాన్లపై దాడి జరిపి 74మంది మృతి చెందిన ఘటనకు సారథ్యం వహించింది ఇతడేనని పోలీసు వర్గాలు చెబుతాయి. తిరుపతి తలపై ఎన్ఐఏ రూ.కోటి రివార్డు ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఏరియాల్లో మావోయిస్టు పార్టీ రిక్రూట్‌మెంట్‌లలో కీలకంగా వ్యవహరించడంతోపాటు మిలటరీ శిక్షణ కేంద్రం నిర్వహణలోనూ తిరుపతి కీలకంగా వ్యవహరించాడు.