ఏపీకి మరో తుపాను ముప్పు

  • Publish Date - November 27, 2020 / 07:33 PM IST

Another low pressure Bay of Bengal : నివార్‌ తుపాను తీరం దాటినా.. అది సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు.. కానీ అంతలోనే మరో తుఫాన్‌ ముప్పు ముంచుకొస్తోంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.



ఈ అల్పపీడనం 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారడమే కాకుండా.. మరింత బలపడి తుపానుగా కూడ మారనుంది. ఈ తుపాను డిసెంబర్‌ 2న తమిళనాడు-పాండిచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు అధికారులు.. ఈ తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందన్నారు విశాఖ వాతావరణశాఖ అధికారులు..



నివార్‌ ఏపీని అతలాకుతలం చేసింది. నివార్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాలు విలవిల్లాడగా ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు నేలకొరిగాయి.

ఈదురుగాలులు, భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను అతలాకుతం చేశాయి. తిరుమలలోని శ్రీవారి ఆలయం పరిసరాల్లో వరద ప్రవహించింది.



చిత్తూరు జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో తూర్పు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చాలా చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. చిత్తూరు నగరంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కింద చెన్నారెడ్డికాలనీలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. అప్పటికే కార్యాలయంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌, మరో నలుగురు సిబ్బంది బయటకు రాలేక ఆందోళన చెందారు.



నివార్‌ తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తూర్పు కంభంపాడులో వరద నీటిలో చిక్కుకున్నారు ఇద్దరు వ్యక్తులు. ఓ తాటి చెట్టును పట్టుకొని ప్రాణాలు రక్షించుకున్నారు. అక్కడే నీటిలో నిలబడి ప్రాణ భయంతో వణికిపోతున్నారు. తమను రక్షించే వారి కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని రఫీ, శ్రీనులుగా గుర్తించారు.