AP Budget: రైతులకు శుభవార్త.. బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు.. వ్యవసాయ యాంత్రీకరణ కోసం ..

ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో అన్నదాతలకు శుభవార్త చెప్పింది.

Minister Atchannaidu

AP Budget: ఏపీ ప్రభుత్వం బడ్జెట్ లో అన్నదాతలకు శుభవార్త చెప్పింది. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయశాఖ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48,341.14 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

 

విత్తన రాయితీ పంపిణీకి రూ. 240కోట్లు, ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు కేటాయింపులు చేశారు. ప్రకృతి వ్యవసాయానికి రూ.61.78కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219.65కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ. 250కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.12,401.58కోట్లు, ఉద్యాన శాఖకు రూ.930.88 కోట్లు కేటాయించారు. అదేవిధంగా పట్టు పరిశ్రమకు రూ.96.22కోట్లు, సహకార శాఖకు రూ.239.85కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,112.7కోట్లు కేటాయింపులు చేశారు.

 

వ్యవసాయ విశ్వవిద్యాలకు నిధులు కేటాయింపులు చేశారు. ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయానికి రూ.507 కోట్లు, వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి రూ. 98కోట్లు, వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి రూ. 154 కోట్లు, ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయానికి రూ. 38కోట్లు కేటాయించారు.

 

మత్స్యకార కుటుంబాలకు వేట నిషేద కాలంలో రూ.20వేలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 245 కోట్లు కేటాయింపులు చేశారు. చేపల వేటకు వెళ్లి మరణించిన వారి కుటుంబాలకు రూ.3.1కోట్ల ఎక్స్ గ్రేషియా బకాయిల చెల్లింపు. ఇందుకోసం రూ. 8కోట్లు కేటాయించారు. మత్స్యకార రంగం అభివృద్ధికి మొత్తం రూ. 540 కోట్లు కేటాయించారు.

 

ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తెచ్చినప్పటి పరిస్థితులను బడ్జెట్ ప్రసంగంలో గుర్తు పయ్యావుల.. డ్రిప్ ఇరిగేషన్ పై అధ్యయనానికి ఇజ్రాయెల్ వెళ్లిన బృందంలో తానూ సభ్యుడిగా ఉన్నట్టు చంద్రబాబుకు గుర్తు చేశారు. దేశంలో తొలిసారిగా ఉమ్మడి ఏపీలోనే డ్రిప్ ఇరిగేషన్ పైలెట్ ప్రాజక్టును అమలు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ బడ్జెట్ లో డ్రిప్ ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 85వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 219 కోట్లు కేటాయించారు.

 

ధరల స్థిరీకరణకు రూ.300కోట్లు కేటాయించారు. మిర్చి పంటకు క్వింటాకు రూ.11 వేలకు ధర నిర్ణయం. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే ఈ ధర వచ్చిందన్నారు. రాష్ట్రీయ కృషి యోజనకు రూ.500 కోట్లు. ఎంఐడీహెచ్ పథకానికి రూ. 179 కోట్లు, ఫామాయిల్ సాగుకు రూ. 179కోట్లు, వెదురు అభివృద్ధికి రూ.2.50 కోట్లు కేటాయించారు.