AP Assembly Budget Session-2023.. 7th Day: టీడీపీ ఎమ్మెల్యేను నెట్టేసిన వైసీపీ సభ్యుడు.. Live Updates

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. 10 సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

AP Assembly Budget Session-2023.. 7th Day: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. 10 సవరణ బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పలు శాఖల పద్దులపై చర్చ జరుగుతోంది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 20 Mar 2023 04:23 PM (IST)

    స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోంది: జగన్

    ఏపీలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందన్నారు సీఎం జగన్. ‘‘యువతకు శిక్షణ పేరుతో దోచేయడం దారుణం. బాబు హయాంలో రూల్స్ బేఖాతరు చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో 90 శాతం సీమెన్స్ భరిస్తుందని చెప్పారు. ఎక్కడైనా ప్రైవేటు కంపెనీ రూ.3 వేల కోట్లు గ్రాంటుగా ఇస్తుందా? విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కాం ఇది’’ అని జగన్ అన్నారు.

  • 20 Mar 2023 02:17 PM (IST)

    పలు శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ

    పలు శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో అటవీ విస్తీర్ణం 3 శాతం పెరిగిందని చెప్పారు. అటవీ విస్తీర్ణం పెంపుదలలో ఏపీ మొదటిస్థానంలో ఉందని అన్నారు.

  • 20 Mar 2023 01:56 PM (IST)

    స్పీకర్ పోడియంలోకి సభ్యులు వస్తే సస్పెన్షన్..

    టీడీపీ సభ్యులు సంస్కారహీనంగా వ్యవహరించారని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి రన్నింగ్ కామెంట్ చేశారని అన్నారు. టీడీపీ సభ్యుల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని అన్నారు. వారు సభను అగౌరవపర్చారని చెప్పారు. స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వలేదని తెలిపారు. స్పీకర్ పోడియంలోకి వస్తే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ వేటు పడుతుందని తమ్మినేని సీతారాం అన్నారు.

  • 20 Mar 2023 12:39 PM (IST)

    టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట కోసమే జీవో నం.1..

    టీడీపీ సభ్యులకు సంస్కారం లేదని, వారు సభలో రౌడీయిజం చేశారని మంత్రి రజని అన్నారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారని, టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకే తాము జీవో నంబరు 1ని తీసుకువచ్చామని చెప్పారు. దాని గురించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్న తీరు సరికాదని అన్నారు.

  • 20 Mar 2023 11:58 AM (IST)

    టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: రోజా

    AP Assembly Budget Session-2023

    కుట్ర రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అలవాటేనని మంత్రి రోజా అన్నారు. సభలో రెచ్చిపోయిన టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు 11 మందిని చంపారని, జీవో నంబరు 1 ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు కౌరవ సభను నడిపారని, ఇప్పుడు సీఎం జగన్ గౌరవ సభను నడుపుతున్నారని రోజా చెప్పారు. సభలో టీడీపీ సభ్యుల తీరు సరికాదని, వారికి స్పీకర్ అంటే గౌరవం లేదని విమర్శించారు.

  • 20 Mar 2023 11:18 AM (IST)

    నేను కిందపడిపోయాను: ఎమ్మెల్యే స్వామి

    టీడీపీ ఎమ్మెల్యేగా సభలో తాను ఉండడం వైసీపీకి కంటగింపుగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తనపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని చెప్పారు. దొంగే దొంగ అన్నట్టు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. "నేనే దాడి చేశానంటున్నారు. దళితుడికే పుట్టావా? అని గతంలో మంత్రి నాగార్జున అన్నారు. ఎడిట్ చేయకుండా వీడియో ఫుటేజ్ విడుదల చేయాలి. క్షేత్ర స్థాయిలో పట్టు కొల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు మాపై దాడులు చేస్తున్నారు. బుచ్చయ్య పైనా దాడికి ప్రయత్నించారు. దీనికి తగిన మూల్యం చెల్లించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

    సుధాకర్ బాబు నాపై దాడి చేసినప్పుడు నేను కిందపడిపోయాను. స్పీకరే ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి.‍. నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతున్నారు. నేనే దాడి చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముందస్తు కుట్రలో భాగంగానే ఈ దాడి. ప్రభుత్వం కులాలను రెచ్చగొడుతోంది. ఎస్సీలే నాపైకి ఎందుకొస్తారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రశ్నించడం వల్లే మాపై దాడులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే ఈ దాడికి కారణం. స్పీకర్ రక్షణ కోసం మార్షల్స్ లేరా..? చివరి వరుసలో ఉన్న వైసీపీ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎలా వచ్చారు?" అని అన్నారు.

  • 20 Mar 2023 11:08 AM (IST)

    అందుకే మాపై దాడి చేశారు: ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్

    వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకుని వచ్చి అసెంబ్లీలో తమపై దాడి చేశారని టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే తమ ఎమ్మెల్యేల పై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ రెక్కలు ఊడిపోవడంతో జీర్ణించుకోలేక దళిత ఎమ్మెల్యే పై దాడి చేశారని చెప్పారు. 70 ఏళ్లు పైబడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏం చేశారని ఆయనపై వైసీపీ సభ్యులు దాడి చేశారని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో దాడికి ప్రతిదాడి ఉంటుందని వైసీపీ నేతలు మర్చిపోవద్దని హెచ్చరించారు. అతి త్వరలో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

     

  • 20 Mar 2023 11:05 AM (IST)

    మాపై దాడి జరిగింది.. మమ్మల్నే సస్పెండ్ చేశారు: గోరంట్ల

    అసెంబ్లీలో తమపై దాడి జరిగితే, తమనే సస్పెండ్ చేశారని టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 40 ఏళ్ల నుంచి చట్టసభల్ని చూస్తున్న తాను, ఇవాళ జరిగినటువంటి పరిణామం ఎన్నడూ చూడలేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడమంటే సభలో బూతులు తిడతారా? అని అన్నారు.

    ఒకరోజు సస్పెన్షన్
    అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. టీడీపీ నేతల తీరు సరిగ్గాలేదని అసహనం వ్యక్తం చేశారు.

  • 20 Mar 2023 10:22 AM (IST)

    టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నా: చంద్రబాబు

    అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని చంద్రబాబుకు అచ్చెన్నాయుడు వివరించారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలుపుతుంటే వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని అన్నారు. బుచ్చయ్య చౌదరిపై కూడా దాడి జరిగిందని తెలిపారు.

  • 20 Mar 2023 10:15 AM (IST)

    స్పీకర్ మినిట్ టు మినిట్ వీడియో బయటపెట్టాలి: అచ్చెన్న

    స్పీకర్ మినిట్ టు మినిట్ వీడియో బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వీరాంజనేయ స్వామి, బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని చెప్పారు. నిజం ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే దాడి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని తెలిపారు.

  • 20 Mar 2023 10:02 AM (IST)

    వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం

    AP Assembly Budget Session-2023

    టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి దగ్గర ఉన్న ప్లకార్డును లాక్కుని వెల్లంపల్లి శ్రీనివాస్ నెట్టేశారు. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది.

  • 20 Mar 2023 09:52 AM (IST)

    వీరాంజనేయ స్వామిని నెట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే

    జీవో నంబరు 1ని రద్దు చేయాలని సభలో టీడీపీ డిమాండ్ చేస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సభ్యుడు వీరాంజనేయ స్వామిపై వైసీపీ సభ్యుడు సుధాకర్ బాబు దురుసుగా ప్రవర్తించారు. వీరాంజనేయ స్వామిని నెట్టేశారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద వీరాంజనేయస్వామి కిందపడిపోయారు.

  • 20 Mar 2023 09:42 AM (IST)

    సభలో టీడీపీ సభ్యుల ఆందోళన

    సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. జీవో నంబరు 1ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. టీడీపీ ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

  • 20 Mar 2023 09:37 AM (IST)

    అచ్చెన్నాయుడి భాష సరిగ్గా లేదు: కొట్టు సత్యనారాయణ

    సభలో టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడి భాష సరిగ్గా లేదని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. జీవో నంబరు 1 అందరికీ వర్తిస్తుందని చెప్పారు. టీడీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని అన్నారు.

  • 20 Mar 2023 09:29 AM (IST)

    ఉద్దేశపూర్వకంగానే టీడీపీ ఆటంకాలు: అంబటి

    ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రజా సమస్యలపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని చెప్పారు. సభలో ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు ఆటంకాలు కలిగిస్తున్నారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు