×
Ad

Speaker Ayyanna Patrudu: కెమెరాల ముందు కాదు.. దమ్ముంటే.. అసెంబ్లీకి రా.. మాట్లాడు.. జగన్ కు స్పీకర్ సవాల్..

అసెంబ్లీ పేరు చెబితేనే జగన్ పారిపోతున్నారని విమర్శించారు.

Speaker Ayyanna Patrudu: వైసీపీ అధినేత జగన్ తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జగన్ కు ఆయన సవాల్ విసిరారు. జగన్ మాట్లాడాల్సింది కెమెరాల ముందు కాదన్న అయ్యన్న.. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అందరు ఎమ్మెల్యేలకన్నా జగన్ కు ఎక్కువ టైమే ఇస్తామన్నారాయన. వైసీపీకి ప్రతిపక్ష హోదా అంశం నియమ నిబంధనలకు లోబడి ఉంటందని, అందులో తన ప్రమేయం లేదని అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు.

నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కు జీవోనే లేదన్నారు. రుషికొండలో కట్టిన ప్యాలస్ ను మెంటల్ ఆసుపత్రి చేసి అందులో జగన్ ని చేర్చాలని స్పీకర్ అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల పులి అని చెప్పుకునే జగన్ ను మొన్న ఎలక్షన్ లో జనాలు చిత్తుగా ఓడించారని చెప్పారు. అసెంబ్లీ పేరు చెబితేనే జగన్ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్సీపట్నంకి మెడికల్ కాలేజీ తీసుకొచ్చానని గొప్పగా చెప్పుకున్న జగన్.. కేంద్రం నుంచి ఎటువంటి అనుమతులు లేవని కేంద్రం నుంచి అనుమతులు లేకపోతే కాలేజీ పర్మిషన్ ఉండదన్న విషయం కూడా జగన్ కు తెలియకపోవడం మన దురదృష్టం అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

Also Read: మూడు ప్రాంతాలు.. మూడు సభలు.. కూటమి బిగ్ ప్లాన్..!

‘అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నావ్. కెమెరాల ముందు, ప్రెస్ ముందు మాట్లాడటం కాదు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. కడప పులి అంట. అసెంబ్లీకి రాలేని వ్యక్తి రాయలసీమ పులి అంట. అసెంబ్లీకి రా. ప్రజల సమస్యల గురించి మాట్లాడు. నీకు సమయం ఇస్తాను. అందరు ఎమ్మెల్యేలకంటే ఎక్కువ టైమ్ నీకిస్తా. ప్రతిపక్ష హోదాకు రూల్స్ ఉంటాయి. నా చేతిలో ఏముంది ఇవ్వడానికి. అసెంబ్లీకి ఒక దేవాలయం. అందులో నేను పూజారిని. వరం ఇస్తే దేవుడు ఇవ్వాలి. పూజారి ఇస్తాడా వరం?’ అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.