ONGC Gas Leak: ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు ఆదేశాలు
మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. గ్యాస్ పైకి చిమ్మి, మంటలు చెలరేగాయి.
Gas Leak at ONGC Drill Site (Image Credit To Original Source)
- ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్
- పెద్ద ఎత్తున కాలిపోయిన కొబ్బరి తోటలు
- ఆందోళనకు గురైన స్థానికులు
ONGC Gas Leak: ఆంధ్రప్రదేశ్‌లోని రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. గ్యాస్ పైకి చిమ్మి, మంటలు చెలరేగాయి. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున కొబ్బరితోటలు కాలిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో మాట్లాడారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని అన్నారు. తాము ఇప్పటికే లీకేజీ ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడామని, సహాయ చర్యలను ముమ్మరం చేయాలని సూచించామని సీఎంకు మంత్రులు చెప్పారు.
Also Read: అందుకే చంపేశాడు..! అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత దారుణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
మంటలను వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని అన్నారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. ఈ పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.
గ్యాస్ లీకేజీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు వివరాలు తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని చెప్పారు. తక్షణమే ఓఎన్‌జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక నిపుణులతో మంటలను అదుపులోకి తెచ్చేలా చూడాలని ఆదేశించారు. స్థానికులు గ్యాస్‌ను పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులను ప్రజలకు అందజేయాలని అధికారులకు సూచించారు.
