AP Politics : ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్.. ఆ మూడు మేయర్ సీట్లపై కమలం పార్టీకి పట్టు..

AP BJP Focusing On Mayoral Posts : ఏపీలో కమలం పార్టీ విశాఖ, తిరుపతి, విజయవాడ మేయర్‌ పీఠంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

AP BJP focusing on mayoral posts

AP BJP Focusing On Mayoral Posts : ఇటు టీడీపీ. ఇటు జనసేన. కూటమిలోని ఈ రెండు పార్టీలు.. స్థానిక ఎన్నికలపై ఎవరి లెక్కల్లో వారు బిజీగా ఉన్నారు. బీజేపీ కూడా సైలెంట్‌గా ఉంటూనే పకడ్బందీ ప్లానింగ్స్‌ చేస్తోందట. కార్పొరేషన్‌ ఎన్నికల్లో డైరెక్ట్ ఫైట్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యూహాలకు పదును పెడుతోందట కమలం పార్టీ. విశాఖ మేయర్‌ పీఠంపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ఏపీ నగర పాలక సంస్థల్లో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అతిపెద్దది. 125 డివిజన్ల డీలిమిటేషన్‌ ప్రాసెస్‌ కూడా జరగబోతోంది. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో విస్తరించి ఉంది. అందుకే ఇక్కడ మేయర్ పీఠం అంటే దాదాపు క్యాబినెట్ మంత్రితో సమానం అన్నట్లుగా భావిస్తున్నారు.

Also Read : USA-Venezuela : ప్రపంచ చమురు రంగంలో సంచలనం.. వెనెజువెలాతో ట్రంప్ మెగా డీల్.. అమెరికా టార్గెట్ అదేనా?

ఏడాదికి ఐదారు వేల కోట్ల బడ్జెట్ ఉండే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం అంటే చాలా పెద్ద పదవి అనే చెప్పొచ్చు. ప్రత్యక్ష ఎన్నికలు జరగబోతుండటంతో తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించాలని మూడు పార్టీలు ఆశిస్తున్నాయి. బీజేపీ ఈ మేయర్ పీఠాన్ని తమకు విడిచి పెట్టాలని కోరాలని డిసైడ్ అయిందట.

1979లో కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మరీ ప్రత్యక్ష ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది బీజేపీ. అప్పుడు జనసంఘ్ రూపంలో ఉన్న బీజేపీ.. తొలిసారి విశాఖ మేయర్‌ అభ్యర్థిని గెలిపించుకొని హిష్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటికీ విశాఖ నగరంలో బీజేపీకి మంచి పట్టు ఉన్నట్లు చెబుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని ప్రచారం నడిచింది. కాని పొత్తుల్లో భాగంగా పక్కనున్న అనకాపల్లి స్థానం బీజేపీకి దక్కగా.. అక్కడి నుంచి కమలం పార్టీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌ గెలిచారు. విశాఖ గ్రేటర్ పరిధి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొంత విస్తరించి ఉంటుంది. దీంతో తమకు గ్రేటర్ పీఠం ఇస్తే ఈజీగా గెలుచుకోవచ్చనే అంచనాల్లో ఉందట కమలం పార్టీ. సేమ్‌టైమ్‌ గత ఎన్నికల్లో తమకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో.. ఇప్పుడు మేయర్‌ పీఠం అయినా వదిలేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు బీజేపీ నేతలు.

విశాఖ మేయర్ సీటుతో పాటు.. విజయవాడ, తిరుపతి నగర పాలక సంస్థలపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, మరో ఎంపీ ఉన్నారు. 2014లో కూడా విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలిచింది. దీంతో తమకు పట్టున్న చోట మేయర్ సీటు దక్కించుకొని.. ఇంకా బలం పెంచుకునే ప్లాన్‌లో ఉన్నారట కమలనాథులు. ఇక గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సీటును గెలుచుకున్న బీజేపీ.. బెజవాడ మేయర్ సీటుకోసం పట్టుబట్టేందుకు రెడీ అవుతోందట. తిరుపతి మేయర్ స్థానం కూడా తమకే ఇవ్వాలని కోరబోతోందట. కూటమి పెద్దల భేటీలో తమ వాదనను బలంగా వినిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. స్టేట్‌ మొత్తంలో అర్బన్‌ ఏరియాల్లో తమ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌ పదవుల్లో పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా సీట్ల సర్దుబాట్లపై దృష్టి పెట్టాలని బీజేపీ డిసైడ్ అయిందట.

రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 88 మున్సిపాలిటీలు, 18 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌ పదవుల పంపకంపై ఇప్పటి నుంచే రాజకీయ చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి నగరాలు రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మికంగా కీలకమైనవి కావడంతో ఇక్కడ మేయర్ పీఠాలను దక్కించుకుంటే పార్టీకి సంస్థాగతంగా, రాజకీయంగా మరింత ప్రయోజనం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోందట.

పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, స్థానిక బలాబలాలు వంటి సమీకరణలు మేయర్ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీజేపీ నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌పై ఒత్తిడి తెస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో సర్దుబాట్ల కోసం ఫాలో అయిన విధానం కాకుండా.. ఇప్పుడు స్థానికంగా పార్టీల బలం, అభ్యర్థుల సామర్థ్యం, వార్డుల వారీగా సమీకరణాలను లెక్కలులోకి తీసుకోవాల్సి ఉంటుంది. విశాఖ, విజయవాడ, తిరుపతి మేయర్ పీఠాల కోసం బీజేపీ పట్టుబడితే.. కూటమిలోని టీడీపీ, జనసేన నుంచి స్పందన ఎలా ఉంటుందో.. కమలం పార్టీ ఆశించినట్లు మేయర్ సీట్లు దక్కుతాయో లేదో చూడాలి మరి.