CM Chandrababu Naidu : ఏపీలో ఉప్పొంగుతున్న నదులు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. మత్స్యకారులకు శుభవార్త..
CM Chandrababu Naidu : ఏపీలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం అందించాలని సూచించారు.
AP CM Chandrababu
CM Chandrababu Naidu : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొన్ని జిల్లాల్లో వరదల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, తాజా.. ఏపీలో వర్షాల ప్రభావం.. నదుల్లో కొనసాగుతున్న వరద ప్రవాహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధిరులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నదుల్లో వరద ప్రవాహం, ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస, సహాయక చర్యలను సీఎస్ సాయిప్రసాద్ సహా అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత ఐదు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్లలేక ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తాజా వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం లోటు కూడా తగ్గినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గతంలో 50 శాతంగా ఉన్న వర్షపాతం లోటు ప్రస్తుతం 31 శాతానికి తగ్గినట్లు వివరించారు. కోస్తాంధ్రలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తరాంధ్రలోని నదుల ప్రవాహాలు, ముంపు పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సీఎంకు వివరాలు అందించారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహం, ప్రస్తుత పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో తక్షణమే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. లిఫ్ట్ పనులను పూర్తి చేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్లోకి తరలించాలని సీఎం స్పష్టం చేశారు.
అదేవిధంగా.. పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద నీటితోనే ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వచేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజ్ కు ఎగువన బ్యారేజీల నిర్మాణం అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
