AP BJP Rajya Sabha Candidate: ఉత్కంఠకు తెరపడింది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి ఎన్డీయే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీనిపై బీజేపీ అధిష్టానం అధికారిక ప్రకటన చేసింది. కూటమి అభ్యర్థిగా పాక వెంకట సత్యనారాయణ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
సత్యనారాయణ పేరుని అభ్యర్థిగా ఖరారు చేస్తూ బీజేపీ ఏపీ కోర్ గ్రూప్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పాక వెంకటసత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నేత. భీమవరానికి చెందిన సత్యనారాయణ బీసీ (గౌడ) సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ప్రస్తుతం ఏపీ బీజేపీ ఎలక్షన్ ఇంచార్జ్ గా ఆయన ఉన్నారు. గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు.
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 ఉపసంహరణకు చివరి తేదీ.
Also Read : 42 నియోజకవర్గాల్లో త్వరలో ఇండస్ట్రియల్ పార్కులు.. ఇక అన్ స్టాపబుల్ గా అమరావతి అభివృద్ధి : సీఎం చంద్రబాబు
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే బీజేపీ కోటా నుంచి భర్తీ అని తేలటంతో వారు ఆశలు వదులుకున్నారు. ఈ స్థానం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరును ఇటీవల అమిత్ షా కు సీఎం చంద్రబాబు సిఫార్సు చేసినట్లుగా తెలిసింది. ఇక, రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ పేర్లూ వినిపించాయి. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. అనూహ్యంగా పాక వెంకట సత్యనారాయణ పేరు కూటమి అభ్యర్థిగా ఖరారైంది.