Ganesh Chathurthi 2026 : మనవడు దేవాంశ్‌తో కలిసి గణనాథుడి పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు
Ganesh Chathurthi 2026 : వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసంలో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Harish Thanniru
- Published on- September 14, 2026 / 02:15 PM IST
Ganesh Chathurthi 2026 : వినాయక చవితి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన నివాసంలో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్, కుటుంబసభ్యులతో కలిసి సీఎం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
చంద్రబాబు ట్వీట్ ప్రకారం.. ‘‘కుటుంబ సభ్యులతో కలిసి మా నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాం. కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చింది. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్ని అయినా వినాయక పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పృహను, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్టితత్వాన్ని బోధిస్తాయి.
సమాజాన్ని సన్మార్గంలో నడిపించేవి మన ధార్మిక కార్యక్రమాలు. ఇందులో వాడవాడలా మండపాలతో జరిగే వినాయక చవితి వేడుకలు మరింత ప్రత్యేకం. మన సంస్కృతికి, ఆధ్యాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా చవితి వేడుకలు కనిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి.. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను.’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
