AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చిరు వ్యాపారులకు శుభవార్త.. రూ.30వేలు..
AP Street Vendors Credit Card : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పింది.
AP Street Vendors Credit Card
AP Street Vendors Credit Card : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తోపుడు బండిపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఇక వ్యాపారం కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా బ్యాంకుల నుంచే క్రెడిట్ కార్డులు అందనున్నాయి.
Also Read : Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఈ టోకెన్లు ఇవ్వరు.. మళ్లీ ఎప్పుడు ఇస్తారంటే!
ఏపీలోని చిరు వ్యాపారులకు ప్రభుత్వం తీపివార్తను చెప్పింది. తోపుడు బండ్లు, చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే వ్యాపారులకు ఇకపై బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డులు అందించనున్నారు. వ్యాపార అవసరాలకోసం కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.30వేల వరకు ఈ కార్డుల ద్వారా వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం అందనుంది.
రాష్ట్రంలోని విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి ప్రధాన నగరాలతో పాటు ఇతర పట్టణాలు, నగరాల్లో కలిపి సుమారు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులు ఉన్నారు. వీరిలో చాలామంది ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, రహదారుల వెంట తోపుడు బళ్లపై పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే, వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి కోసం అనేక మంది చిరు వ్యాపారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సి రావడంతో వారి ఆదాయంలో గణనీయమైన మొత్తం రుణాల చెల్లింపులకే వెళ్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం 3.59 లక్షల మంది చిరు వ్యాపారుల వద్ద క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయి. మరో లక్ష షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రుణాలు పొందని 1,61,481 మంది వ్యాపారులను గుర్తిస్తున్నారు. వారికి వచ్చే నెలాఖరులోగా సుమారు రూ.5 కోట్ల రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అక్టోబరు 1 నుంచి నెలాఖరు వరకు ‘లోక కల్యాణ మేళా’ ద్వారా రుణాలు అందించనున్నారు. పీఎం స్వనిధి కింద గతంలో రూ.10 వేలు, రూ.20 వేలు, రూ.50 వేల వరకు రుణాలు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ రుణ పరిమితులను రూ.15 వేలు, రూ.25 వేలు, రూ.50 వేలుగా పెంచారు. అదనంగా రూ.30 వేల నగదు పరిమితితో క్రెడిట్ కార్డులను అందించనున్నారు. వీధి వ్యాపారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సహకారంతో శుభ్రత, ఆహార భద్రతపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
