IND vs AFG : అఫ్గాన్‌తో తొలి టీ20లో విజయం.. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు.. మాకు వేరే మార్గం లేకుండా పోయింది..
అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ (IND vs AFG )శుభారంభం చేసింది.
India beat Afghanistan in 1st T20 match by 7 wickets Shreyas Iyer key comments
IND vs AFG : అఫ్గానిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (64 నాటౌట్; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మహ్మద్ నబీ (33; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం అభిషేక్ శర్మ (82; 32 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ (42; 33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ రెండు వికెట్లు తీశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ వికెట్ సాధించాడు.
తొలి టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం సాధించడం పట్ల టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. తమ బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. ‘ఈ విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేశారు. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా.. బుమ్రా జట్టుకు ఒక గొప్ప ఆస్తి. అర్ష్‌దీప్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అక్షర్, వరుణ్ బౌలింగ్ చేసిన తీరు కూడా అమోఘం.’ అని శ్రేయస్ అన్నాడు.
ఇక చివరి ఓవర్‌ను దూబే చేత వేయిండం గురించి మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో తనకు వేరే మార్గం కనిపించలేదన్నాడు. పిచ్ వేగం ఎలా ఉందో, బంతి ఎలా వెళ్తుందో అంచనా వేయడం అతనికి సాధ్యం కాలేదు. ఆ సమయంలో అతను బాగా రాణిస్తాడని నేను భావించాను, కానీ పర్వాలేదు, ఇది క్రికెట్ కదా. అతను ఎక్కడ మెరుగుపడాలో ఖచ్చితంగా విశ్లేషించుకుంటాడని నాకు నమ్మకం ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే.. అభిషేక్ ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి తప్పుడు షాట్లు ఆడలేదు. కొన్ని షాట్లు అయితే ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఇక ఇషాన్ గురించి చెప్పాలంటే.. అతను ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనూ, ప్రాక్టీస్ సెషన్లలో మైదానంలోనూ అతను చాలా ప్రశాంతంగా, నిలకడగా కనిపిస్తున్నాడు. తన ఆటపై అతనికి మంచి అవగాహన ఉంది. కాబట్టి.. జట్టుగా మాకు ఇది చాలా మంచి సంకేతం అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
