రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక

  • Publish Date - October 25, 2020 / 08:39 AM IST

CM YS Jagan agrees to release pending DA : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దసరా పండుగ సందర్భంగా తీపికబురు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పెట్టిన రెండు డీఏలతోపాటు మొత్తం మూడు కరువు భత్యాలు (డీఏలు) మంజూరు చేయడానికి అనుమతి ఇచ్చారు.

ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిసి పెండింగ్‌ డీఏలను మంజూరు చేయాల్సిందిగా కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ మొత్తం మూడు డీఏలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు.



మూడు డీఏల మంజూరు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.3,802 కోట్లు భారం పడుతుంది. అలాగే బకాయిలను ఉద్యోగుల భవిష్య నిధి (జీపీఎఫ్‌)కు జమ చేయడానికి మరో రూ.9,504 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల 4,49,000 ఉద్యోగులకు, 3,57,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది.

ఈ విధంగా చెల్లిస్తారు
జూలై 2018 నుంచి ఇవ్వాల్సిన డీఏను వచ్చే ఏడాది జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను మాత్రం ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలను ఫిబ్రవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.



జనవరి 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ వచ్చే ఏడాది జూలై వేతనాలతో నగదు రూపంలో ఆగస్టు 1న ఇస్తారు. డీఏ బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమ చేస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఆగస్టు నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.



జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏ 2022 జనవరి వేతనాలతో నగదు రూపంలో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. డీఏ బకాయిలను అదే ఏడాది ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో జీపీఎఫ్‌కు జమ చేస్తారు. సీపీఎస్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు బకాయిలను ఫిబ్రవరి నుంచి ఐదు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లిస్తారు.