Jagan
Spandana Update Version : స్పందన సేవలను ఏపీ సర్కార్ మరింత సులభతరం చేసింది. ఫిర్యాదుదారుల సౌకర్యార్థం.. పోర్టల్‌ను ఈజీగా చేసింది. మరి స్పందన న్యూ వర్షన్ పోర్టల్‌లో కొత్తగా చేర్చిన అంశాలేంటి..? అందులో ఏమున్నాయి..? మరింత ఆధునీకరించిన నూతన స్పందన పోర్టల్‌ను ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక.. అది పరిష్కారమయ్యే తీరును నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు ట్రాక్ చేయాలని సూచించారు. ఈ ట్రాకింగ్ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలని.. పౌరుల నుంచి గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కనపడేసే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. నేరుగా సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని చెప్పారు.
పాత స్పందన పోర్టల్‌లో 2 వేల 677 సబ్జెక్టులు, 27 వేల 919 సబ్ సబ్జెక్టులు ఉండేవి. అప్‌డేటెడ్ పోర్టల్‌లో 858 సబ్జెక్టులు, 3 వేల 758 సబ్ సబ్జెక్టులు ఉన్నాయి. దీనివల్ల చాలావరకూ సమయం ఆదా అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాలు లక్ష్యంగా కొత్త స్పందన పోర్టల్‌లో ప్రజలు నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. గ్రామ సచివాలయాలు, కాల్ సెంటర్, వెబ్ అప్లికేషన్, మొబైల్ యాప్, ప్రజా దర్బార్ల ద్వారా కాని వినతులు ఇచ్చే అవకాశం ఉంది. తీసుకున్న ఫిర్యాదులను అత్యంత తీవ్రమైనవి, తీవ్రమైనవి, సాధారణమైనవిగా వర్గీకరిస్తారు. ఇచ్చిన వినతి లేదా, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఫిర్యాదుదారులకు మూడు ఆప్షన్స్ ఉంటాయి.
ఫుల్ ఫోకస్ అంతా ప్రజా సమస్యలపై పెట్టాలంటూ.. సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నవరత్నాల్లో ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని.. నవరత్న పథకాల సోషల్ ఆడిట్ సమయంలోనే అర్హులైన వారి పేర్లు రాలేదని తెలిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసిన 90 రోజుల్లో ఇంటి పట్టా అందేలా చూడాలంటూ జగన్ ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా ఇంటిపట్టా అందించాల్సిన బాధ్యత అధికారులదేన్నారాయన.