Pawan Kalyan: పన్నుల ఎగవేత.. గోదావరి తీవ్ర కాలుష్యం.. ఆంధ్రా పేపర్ మిల్స్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం
గోదావరి నది కాలుష్యం, పన్నుల బకాయిల వ్యవహారంలో ఆంధ్రా పేపర్ మిల్స్ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- V Santhosh Kumar
- Published on- September 4, 2026 / 05:35 PM IST
Ap deputy cm pawan kalyan serious warning to andhra paper mills
- ఆంధ్రా పేపర్ మిల్స్‌పై పవన్ ఆగ్రహం
- గోదావరి కాలుష్యానికి సగం బాధ్యత
- పన్నుల బకాయిలపై కఠిన చర్యలు
Pawan Kalyan: గోదావరి నది కాలుష్యం, పన్నుల బకాయిల వ్యవహారంలో ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యం అవలంబిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజమహేంద్రవరం ప్రాంతంలో గోదావరి నది కాలుష్యానికి గురికావడంలో దాదాపు సగం బాధ్యత ఆంధ్రా పేపర్ మిల్స్‌దేనని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఒకవైపు నదిలోకి రసాయన వ్యర్థాలను విడిచిపెడుతూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న యాజమాన్యం, మరోవైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతోందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పన్నులు ఎగ్గొడుతూ కోర్టులతో కాలయాపన:
ఆంధ్రా పేపర్ మిల్స్ సంస్థ ప్రభుత్వానికి పన్నులు చెల్లించి పుష్కరకాలం దాటిపోయిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. పన్నులు బకాయిలు చెల్లించాలని కోరితే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తప్పును సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం తగిన అవకాశం ఇచ్చినప్పటికీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేదని తెలిపారు. చివరికి నోటీసులు పంపి మూడు నెలల సమయం ఇచ్చినప్పటికీ కనీసం స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఆంధ్రా పేపర్ మిల్స్‌పై కఠిన చర్యలకు ఆదేశం!
పర్యావరణాన్ని పాడుచేస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ఆంధ్రా పేపర్ మిల్స్ వ్యవహారంలో ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం సదరు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పరిశ్రమలు నిబంధనలకు కట్టుబడి నడుచుకోవాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి సంస్థలైనా సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు.
