Kollu Ravindra: ఆధార్ కార్డు ఉంటే చాలు.. మద్యం షాపు లైసెన్స్ మీదే.. అక్టోబర్ 5న డ్రా.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) స్పష్టం చేశారు.
Excise Minister Kollu Ravindra made interesting comments regarding ap liquor policy.
Kollu Ravindra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ, నూతన మద్యం పాలసీకి సంబంధించి ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు మద్యం దుకాణం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra)స్పష్టం చేశారు. శనివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, నూతన విధానంలో అక్టోబరు 5వ తేదీన లాటరీ (డ్రా) పద్ధతి ద్వారా అర్హులైన వారికి పారదర్శకంగా షాపులను కేటాయిస్తామని వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వ్యాపార వర్గాల్లో, దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మద్యం నాణ్యతపై ప్రత్యేక నిఘా – ‘ఎక్సైజ్ సురక్షా’ యాప్ ప్రారంభం:
మద్యం తయారీ డిస్టలరీల నుంచి విక్రయించే షాపుల వరకు ప్రతి దశలోనూ పూర్తిస్థాయి పర్యవేక్షణ ఉంటుందని, ఎక్కడా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. వినియోగదారులు మద్యం బాటిల్‌పై ఉన్న కోడ్‌ను ‘ఎక్సైజ్ సురక్షా యాప్’ ద్వారా స్కాన్ చేసి దాని సమగ్ర వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వ కొత్త బ్రాండ్లు – వైకాపా పాలనపై మంత్రి విమర్శలు:
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తిగా అవినీతిమయంగా మారిందని, రవాణాలో కూడా రూ.కోట్ల దోపిడీకి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్లోకి 80 శాతం కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే మద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారని, ఆ దిశగా చర్యలు వేగవంతం చేశామని వివరించారు.
