Pawan Kalyan Health Update : పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స విజయవంతం.. కీలక విషయాలు వెల్లడించిన వైద్యులు..

Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ఉదయం ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని జనసేన పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది.

Pawan Kalyan Health Update

  • పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం
  • రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
  • తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
  • మూడున్నర గంటలపాటు నిర్వహించిన వైద్యులు

Pawan Kalyan Health Update : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ఉదయం ముంబయిలోని ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని జనసేన పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ప్రకటించింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణురాలైన డాక్టర్ దిన్షా పార్థివాలా నేతృత్వంలోని వైద్యుల బృందం పవన్ కల్యాణ్ కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు పేర్కొంది. భుజంలో అవల్షన్ ఫ్రాక్చర్‌తోపాటు రోటేటర్ కఫ్ గాయం కూడా కావడంతో, ఈ పెద్ద శస్త్రచికిత్స అవసరమైంది. ఈ శస్త్రచికిత్సకు మూడున్నర గంటల సమయం పట్టింది. ఆయనను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు తీసుకువచ్చారు. ఆయన అనస్థీషియా ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని జనసేన పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది.

Also Read : Boat Capsizes : వియత్నాంలో భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా.. ఏపీ టూరిస్టులతోసహా పలువురు మృతి

పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయాలని వైద్య నిపుణులు సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం ఆపరేషన్ చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే, రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రంగా ఉంటుందని వైద్యులు సూచించడంతో.. ప్రస్తుతం కుడి భుజానికి మాత్రమే శస్త్రచికిత్స చేశారు. ఎడమ భుజానికి మరో రెండు నెలల వ్యవధిలో ఆపరేషన్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.

2016లో గాయం.. పదేళ్లుగా నొప్పితోనే విధులు..
పవన్ కళ్యాణ్‌కు 2016లో భుజానికి గాయం అయింది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికీ, ఆయన ప్రజా కార్యక్రమాలు కొనసాగించారు. 2018లో నిర్వహించిన జనసేన పోరాట యాత్రలో, అలాగే అనంతరం వివిధ పర్యటనలు, ఎన్నికల ప్రచారం, వారాహి యాత్రల్లో అభిమానులు ఉత్సాహంగా కరచాలనం చేయడం, చేతులు పట్టుకోవడం, హత్తుకోవడం వల్ల భుజాలపై ఒత్తిడి మరింత పెరిగింది. తీవ్ర నొప్పి ఉన్నప్పటికీ ప్రజలకోసం ఆయన కార్యక్రమాలు కొనసాగించారని జనసేన ముఖ్యనేతలు వివరించారు.

అయితే, ఈ ఏడాది ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స సందర్భంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాలకు రొటేటర్ కఫ్ గాయాలతో పాటు కండరాల చీలికలు (మసిల్ టియర్స్) కూడా తీవ్రస్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇంత తీవ్రమైన గాయాలతో ఇన్నేళ్లుగా ఆయన విధులు నిర్వహించడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొద్ది వారాల క్రితం ముంబయిలో మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, శనివారం కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్సను వైద్యులు పూర్తి చేశారు.

పవన్ కల్యాణ్ కు శస్త్రచికిత్స నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అళధైర్యపడొద్దని.. పవన్ కోలుకుంటున్నారని పేర్కొంది.

రోటేటర్ కఫ్ సమస్య అంటే ఏమిటి?
భుజం సులభంగా కదలడానికి సహాయపడే కండరాలు, స్నాయువుల సముదాయాన్ని రొటేటర్ కఫ్ అంటారు. ఈ భాగంలో గాయం లేదా కండరాలు చిరిగిపోతే చేతిని పైకెత్తడం కష్టం అవుతుంది. తీవ్రమైన నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్యను ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయొద్దని.. అలాచేస్తే శస్త్ర చికిత్స అవసరం కావచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.