Boat Capsizes : వియత్నాంలో భారతీయులతో వెళ్తున్న పర్యాటక బోటు బోల్తా.. ఏపీ టూరిస్టులతోసహా పలువురు మృతి
Boat Capsizes in Vietnam : వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఫు క్వాక్ దీవి సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడటంతో 18మంది మృతిచెందినట్లు సమాచారం.
Boat Capsizes
Boat Capsizes : వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఫు క్వాక్ ద్వీపం సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడటంతో 18మందికిపైగా మృతిచెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందగా.. ఆమె భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ మరణించగా.. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మొబైల్ కంపెనీ తరపున భారత్‌లోని ఏపీ, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వియత్నాంకు 250మంది డీలర్లు వెళ్లారు. ట్రిప్‌లో 35మంది ఏపీకి చెందిన వారు.. 40మంది తెలంగాణకు చెందిన డీలర్లు ఉన్నారు. వీరంతా మూడు బోట్లలో వియత్నాంకు సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో హాలాంగ్‌బేలో స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ బోటు తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా.. సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడింది.
బోటు ప్రమాదంలో 18మంది మృతి చెందినట్లు సమాచారం.. వీరిలో ఏపీతోపాటు తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు పరిస్థితి విషయమంగా ఉంది. రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమై కొందరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రతికూల వాతావరణం వల్లనే బోటు మునిగిపోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు వెల్లడించారు.
వియత్నాం భారతీయ రాయభార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని గంటల క్రితం వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడిన విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక అధికారులు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తుండగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
బాధితుల కుటుంబాలకు సమాచారం, సహాయం అందించేందుకు, హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్‌లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. దీనిని +84 36 281 7930, +84 91 552 37 14 మరియు +84 33 452 0414 నంబర్లలో సంప్రదించవచ్చు. హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది, దీనిని +84 91 308 9165 నంబర్లో సంప్రదించవచ్చు. ఎలాంటి సహాయం, సందేహాలకైనా మేము అందుబాటులో ఉంటామని తెలిపింది.
