AP EAPCET Result 2026 : విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ ఫలితాల విడుదల వాయిదా.. రిజల్ట్ వచ్చేది ఎప్పడంటే..
AP EAPCET Result 2026 : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. అందుకు గల కారణాలు ఏంటి.. కొత్త తేదీ వంటి వివరాలు తెలియాలంటే...
- Dharani Pilli
- Updated on- June 1, 2026 / 01:24 PM IST
ap eapcet result 2026 postponed to june third week reason for this and new dates details here
AP EAPCET Result 2026 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కల్పించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలపై కీలక ప్రకటన వెలువడింది. జూన్ మూడో వారంలో ఫలితాలు వెల్లడించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రిజల్ట్స్ వాయిదా పడటంతో మరికొంత కాలం ఎదురుచూడక తప్పేలా లేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు జూన్ 1న విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జూన్ మూడో వారంలో ఈ ఫలితాలు వెలువడనున్నాయి.
ఫలితాల వాయిదాకి కారణం
ఫలితాలు వాయిదా పడటానికి గల ప్రధాన కారణం.. ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షల నిబంధనల ప్రకారం, ఈఏపీసెట్ ర్యాంకును కేటాయించేటప్పుడు కేవలం ప్రవేశ పరీక్ష మార్కులను మాత్రమే కాకుండా, ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు రాకుండా ఈఏపీసెట్ ర్యాంకులు ప్రకటిస్తే.. ఇంప్రూవ్‌మెంట్ రాసే లక్షలాది మంది విద్యార్థులకు ఈ ర్యాంకుల కేటాయింపులో అన్యాయం జరుగుతుందని భావించిన అధికారులు ఫలితాల విడుదలను వాయిదా వేశారు.
ఒకవేళ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 1న ఫలితాలు ప్రకటిస్తే, ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ ఫలితాల తర్వాత మార్కులు పెరిగితే ప్రస్తుతం విద్యార్థులకు కేటాయించిన ర్యాంకుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. ఇదే జరిగితే కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం తలెత్తుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నత విద్యామండలి అధికారులు.. విద్యార్థులలో ఎవరికీ అన్యాయం జరగకుండా, సమానంగా, పారదర్శకంగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈఏపీసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేశారు. ప్రభుత్వం ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాకే ఈఏపీసెట్ ర్యాంకులను వెల్లడించాలని నిర్ణయించింది.
జూన్ 5న ముగియనున్న పరీక్షలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అనగా జూన్ 5న ఈ పరీక్షలు పూర్తవుతాయి. ఎగ్జామ్స్ అయిన వెంటనే యుద్ధప్రాతిపదికన మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇంప్రూవ్‌మెంట్, సప్లిమెంటరీ పరీక్షల పేపర్లు దిద్దడానికి సుమారు 13 రోజుల సమయం పడుతుందని, ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.
వేగంగా జవాబు పత్రాల మూల్యాంకనాన్ని.. తప్పులు లేకుండా పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులను ఆదేశించారు. ఈ ఫలితాలు వచ్చాకే జూన్ మూడో వారంలో ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు ఈ సమయాన్ని వృథా చేసుకోకుండా కౌన్సెలింగ్ ప్రక్రియకు అవసరమైన సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవడం మంచిది.
