గంగమ్మ కరుణించింది..జాలరి వలలో పడ్డ రూ.1.70 లక్షల ఖరీదైన చేప

  • Publish Date - September 23, 2020 / 05:35 PM IST

గంగమ్మ బిడ్డలు జాలరులు. గంగమ్మ ఒడిలో చేపలు పట్టుకుని జీవిస్తుంటారు. వలనిండా చేపలు పడితే ఆరోజు గంగమ్మ బిడ్డలకు పండుగే పండుగ. వలలతో నీటిలోకి వెళ్లే ముందు ప్రతీ జాలరీ..‘‘అమ్మా గంగమ్మా..నిన్నే నమ్ముకుని బతుకుతున్నాం..మేం నీ బిడ్డలం మమ్మల్ని కరుణించి వలనిండా చేపలు పడేలా దీవించు తల్లీ’’ వేడుకుని దణ్ణం పెట్టుకుని పడవ ఎక్కుతారు.


అదిగో అచ్చు అలాగే ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఓ జాలరి రోజూవారీ వృత్తిలో భాగంగా ఆరోజు కూడా ఆ జాలరి చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటి మాదిరిగానే ‘గంగమ్మ తల్లి కరుణించి కాసిన్ని చేపలు నా వలకు ఎక్కువ పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో నా కుటుంబంతో ఆనందంగా ఉండొచ్చు’ అని దణ్ణం పెట్టుకుని సముద్రంలో పడవ తోసుకుంటూ వెళ్లాడు.


ఆ జాలరి మాటలు గంగమ్మ విన్నట్టుంది. అతని వలకు ఓ చేప చిక్కింది. దానిని చూడగానే అతను ఒక్కసారిగా ఎగిరి గంతేశాడు. అది అలాంటింలాంటి చేప కాదు మరి..‘‘కచ్చిలి చేప’’. దాని విలువ అక్షరాలా లక్షల రూపాయలు ఖరీదుంటుంది. దాన్ని చూడగానే ఈ జాలరి ‘‘అమ్మా తల్లీ గంగమ్మా నన్ను కరుణించావు తల్లీ నీకు శతకోడి దండాలుతల్లీ..దండాలు’’ అంటూ తెగ మురిసిపోయాడు.


ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. మంగళవారం (సెప్టెంబర్ 23,2020) అతని వలకు 28 కిలోల బరువున్న అరుదైన కచ్చిలి చేప చిక్కింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చేపను కొనుగోలు చేసేందుకు చాలామంది పోటీలు పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశాడు. ఆ డబ్బులను చూసి దోనిదేవుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆనందంగా గెంతులేసుకుంటూ ఇంటికెళ్లాడు. కచ్చిలి చేప పొట్ట భాగాన్ని మెడిసిన్ తయారీలో వినియోగిస్తారని..అందుకే అంత ఖరీదు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు.