AP Government Creates Record In Pensions
AP Government : నూతన సంవత్సరంలో పెన్షనర్లకు కానుక ప్రకటించిన ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యధిక పెన్షన్ చెల్లిస్తున్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఈ నెల నుంచి నెలకు మూడు వేల రూపాయల చొప్పున పింఛన్ల పంపిణీ చేయడం ద్వారా దేశంలో సంక్షేమ పింఛన్లలో అగ్రస్థానానికి చేరుకుంది ఏపీ సర్కార్. అంతేకాకుండా వైసీపీ మ్యానిఫెస్టోలో మరో హామీని నెరవేర్చినట్లైంది.
పెంచిన పెన్షన్లు పంపిణీ..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పెన్షన్ కానుక ప్రకటించారు. జనవరి 3 నుంచి 3వేల రూపాయల చొప్పున పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి.. పెంచిన పింఛన్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మూడో తేదీన కాకినాడలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ హాజరుకానున్నారు.
ఏటా 500 రూపాయలు పెంపు..
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా పింఛన్ల మొత్తం 2వేల రూపాయల నుంచి 3వేల రూపాయలకు పెంచారు. అధికారంలోకి రాగానే రెండు వేల రెండు వందల 50 రూపాయలు చేసింది వైసీపీ ప్రభుత్వం. అప్పటి నుంచి ఏటా రెండు వందల 50 రూపాయలు చొప్పున పెంచుతూ నాలుగేళ్లలో మూడు వేల రూపాయలు చేసింది జగన్ ప్రభుత్వం.
Also Read : డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు..! సిక్కోలు వైసీపీలో హైటెన్షన్
నాడు వెయ్యే.. నేడు 3వేలు..
సీఎం జగన్ ఎన్నికల హామీలో పింఛన్ల పెంపు ప్రధానమైనది. ఇప్పుడు మూడు వేల రూపాయలు చేయడంతో ఎన్నికల హామీని నెరవేర్చినట్లైంది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ మొత్తం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనని.. తాము ఈ మొత్తాన్ని మూడు వేల రూపాయలు చేసి సీఎం ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని వైసీపీ నేతలు కొనియాడుతున్నారు.
83వేల కోట్లు.. పెన్షన్ల కోసం చేసిన ఖర్చు
వృద్ధులు, వితంతువులతోపాటు చేనేత, కల్లు గీత కార్మికులు మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ బాధితులకు కూడా పెంచిన పింఛన్ అందించనుంది ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీలో 66 లక్షల 34 వేల మందికి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో జగన్ సీఎం అయ్యాక మంజూరు చేసిన పెన్షన్లే.. 29 లక్షల 51 వేల 760 ఉన్నాయి. ఇక పెంచిన మొత్తంతో ఈ నెల నుంచి 23 వేల 556 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 83 వేల 526 కోట్ల రూపాయలను పింఛన్ల కోసం ఖర్చు చేసింది.
దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ మొత్తం పింఛన్లు ఇవ్వడంలేదు. ఏపీలో మాత్రమే దాదాపు 66 లక్షల 34 వేల మందికి పింఛన్లు ఇస్తున్నారు. అదీ అత్యధిక మొత్తం కావడం విశేషం. ముఖ్యంగా పింఛనర్లకు ఒకటో తేదీ ఉదయాన్నే వారి ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇస్తున్నారు వలంటీర్లు. గత నాలుగున్నరేళ్లుగా ఒకటో తారీఖునే దాదాపు 85 నుంచి 95% పింఛన్లను పంపిణీ చేసిన రికార్డును స్థాపించింది జగన్ సర్కార్.
Also Read : న్యూఇయర్ వేడుకల మాటున ఆ నేతల బలప్రదర్శన.. కాకినాడ జిల్లాలో కాక