Ap Government: రూ.35కే కిలో ఉల్లిపాయలు.. పామాయిల్, కందిపప్పు కూడా తక్కువ ధరకే.. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government)సామాన్యులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాలు తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- September 4, 2026 / 02:27 PM IST
Ap government market intervention onion at 35 rupees and essential price control
- రూ.35కే కిలో ఉల్లిపాయలు పంపిణీ
- రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు
- పామాయిల్, కందిపప్పు ధరల తగ్గింపు
Ap Government: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government)సామాన్యులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కెట్‌లో పెరిగిన ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై నిత్యావసరాల ధరల నియంత్రణపై సమగ్రంగా సమీక్షించింది. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులను రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
ఎన్‌సీసీఎఫ్ ద్వారా ఉల్లి సరఫరా: పామాయిల్, కందిపప్పుపైనా ప్రత్యేక ఫోకస్!
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌సీసీఎఫ్ సహకారంతో అవసరమైన ఉల్లిపాయలను రాష్ట్రానికి రప్పించి, రైతు బజార్లలో రూ. 35కే కిలో చొప్పున విక్రయించనున్నారు. అలాగే బహిరంగ మార్కెట్ ధర కంటే రూ. 10 తక్కువకే పామాయిల్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కందిపప్పు ధరల నియంత్రణకు కేంద్రం నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులను కేటాయించాలని కోరినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సేకరించిన సరుకులను ప్రాసెసింగ్ చేసి, తక్కువ ధరలకే పంపిణీ చేయడమే కాకుండా ధరల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
బియ్యం విక్రయాలకు భారీ స్పందన: అక్రమ నిల్వలపై కఠిన చర్యలు!
ఇప్పటికే ఏర్పాటు చేసిన 651 ప్రత్యేక కౌంటర్ల ద్వారా 10,163 క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయించి, లక్ష మందికి పైగా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల విన్నపం మేరకు నెల్లూరు మిల్లర్ల నుంచి 10,000 మెట్రిక్ టన్నుల KNM రకం బియ్యాన్ని సేకరించి అందుబాటులో ఉంచనున్నారు. మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉల్లి, పప్పు ధాన్యాల ధరల తగ్గింపుపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
