AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఆ డబ్బులు వెనక్కిచ్చేస్తున్న ప్రభుత్వం.. ఒక్కొక్కరికి..

2009లో అభయహస్తం స్కీమ్ తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళల కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయలు చెల్లిస్తే..

  • Updated on- April 24, 2026 / 06:02 PM IST

AP Dwcra Women Abhaya Hastam Funds

AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అభయ హస్తం నిధులను వెనక్కి ఇవ్వనుంది. గతంలో మహిళలు పొదుపు చేసిన మొత్తం రూ.1,194 కోట్లను తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 22 లక్షల మంది మహిళలకు లబ్ది కలగనుంది.

అభయహస్తం పింఛన్ పథకం కోసం డ్వాక్రా మహిళలు 12 ఏళ్ల పాటు పొదుపు చేశారు. అలా 22 లక్షల మంది మహిళలు 1194 కోట్ల రూపాయలు పొదుపు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ వాటా వెయ్యి కోట్లు కలిపితే మొత్తం నిధులు రూ.2,194 కోట్లకు చేరింది. అయితే, వైసీపీ ప్రభుత్వం 2021లో ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించింది. అయితే, తమ డబ్బు తమకు వెనక్కు ఇవ్వాలని డ్వాక్రా మహిళలు కోరారు. కానీ ఇవ్వలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి డ్వాక్రా మహిళలు పొదుపు చేసిన మొత్తాన్ని వెనక్కు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. తాజాగా ఆర్థిశాఖ నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. త్వరలోనే అభయహస్తం పొదుపు డబ్బులు డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. 12ఏళ్ల పాటు చేసిన పొదుపు డబ్బులు వారికి తిరిగి ఇవ్వనుంది.

2009లో అభయహస్తం స్కీమ్ తీసుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళల కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరు 365 రూపాయలు చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మరో 365 రూపాయలు జమ చేసేలా నిర్ణయం తీసుకుంది. అభయ హస్తం పథకంలో చేరిన డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు 60 ఏళ్లు నిండాక నెలకు 500 రూపాయల పెన్షన్ ఇస్తారు. 2019 వరకు ఈ పథకం కొనసాగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ మొత్తం డబ్బును ఇతర అవసరాలకు బదలాయించుకుంది.

రెండేళ్లు వరుసగా సభ్యులు వాటా చెల్లించకపోతే సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన ఉంది. 2021-22 నుంచి సభ్యుల నుంచి వాటా వసూలు నిలిపివేసింది అప్పటి వైసీపీ సర్కార్. నిబంధనల ప్రకారం రెండేళ్ల తర్వాత సభ్యత్వం రద్దయిన వారికి జమ చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. మరణించిన వారి కుటుంబసభ్యులకు కూడా డబ్బులు చెల్లించలేదు.

డ్వాక్రా మహిళల విజ్ఞప్తితో ఈ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో 22 లక్షల మందికి లాభం కలగనుంది. అభయహస్తం కింద పొదుపు చేసిన డబ్బులను త్వరలోనే డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.

Also Read: డిజిటల్ పేమెంట్స్ కోసం RBI కొత్త రూల్స్.. రూ.10 వేల కన్నా ఎక్కువ పంపాలంటే ఎదురు చూడక తప్పదు