Onion Rates: రూ.35కే కేజీ ఉల్లిపాయ.. రేషన్ కార్డు ఉంటే చాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పిస్తూ ఉల్లిపాయల ధరల (Onion Rates)నియంత్రణపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published on- September 29, 2026 / 08:50 PM IST
Ap govt supplies subsidized onion at 35 rupees per kg in rythu bazars
Onion Rates: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతు బజార్ల ద్వారా రాయితీపై కేజీ ఉల్లిని కేవలం రూ.35కే అందించాలని నిశ్చయించింది. ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సంయుక్తంగా వెల్లడించారు. విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్‌లో ఈ పంపిణీని మంత్రులు ప్రారంభించారు.
Rain Alert: ద్రోణి ప్రభావంతో దంచి కొట్టనున్న వర్షాలు.. అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాల హెచ్చరిక!
కుటుంబానికి 2 కేజీలు – నిబంధనలు ఇవే:
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సబ్సిడీ ఫలాలు ప్రతి కుటుంబానికి సమానంగా అందేలా పక్కా నిబంధనలు రూపొందించారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డును ప్రాతిపదికగా తీసుకుని ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల చొప్పున ఈ రాయితీ ఉల్లిపాయలను(Onion Rates) అందజేస్తారు. తొలి దశలో ప్రధాన నగరాల్లోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా, ప్రజల డిమాండ్‌ను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలకు ఈ విక్రయాలను విస్తరించనున్నారు.
కేంద్ర NCCF సహకారం – నిత్యవసరాల ధరలపై నిఘా:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NCCF సహకారంతో నాణ్యమైన ఉల్లిపాయలను సేకరించి ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పెరిగిన ధరల భారం నుంచి తక్షణ ఉపశమనం లభించడంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్యులు, గృహిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మిగతా నిత్యావసర వస్తువుల ధరలను సైతం అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు హామీ ఇచ్చారు.
