ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

  • Publish Date - November 1, 2020 / 06:25 AM IST

AP Govt formation day fete from Nov 1 : విభజన తర్వాత ఏపీలో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. 2020, నవంబర్ 01 ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించబోతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించలేదు. దాదాపు ఏడేళ్ల తరువాత ఈ వేడుకలు జరుగుతున్నాయి.



తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సీఎం జగన్ ఈ వేడుకల్ని ప్రారంభించనున్నారు. తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నివాళులు అర్పించి జిల్లాల వేడుకల్ని వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా ప్రారంభిస్తారు. ఇక రాజ్ భవన్‌లో గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ వేడుకల్లో పాల్గొననున్నారు.



రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం జూన్ 2 తేదీన నవ నిర్మాణదీక్ష పేరుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దీక్షలు చేపట్టింది. అయితే అప్పట్లో దీనిపై కాస్త విమర్శలు వచ్చాయి. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయింది కనుక ఏపీ అవతరణ దినోత్సవం మార్చడం సరికాదని వాదన వినిపించింది. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటవ తేదీన జరపాలని డిమాండ్ చేసింది.



నవంబర్‌ 1వ తేదీనే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని గతంలో కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఆదివారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకులను నిర్వహించబోతుంది వైసీపీ ప్రభుత్వం.