వైసీపీ సర్కారుకు బిగ్ షాక్…3 రాజధానులపై హైకోర్టు “స్టే”

3 రాజధానులపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై మంగళవారం స్టేటస్ కో విధిస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రిప్లై కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీచేసింది.



ఏపీలో 3 రాజధానులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని రాజధాని రైతు పరిరక్షణ సమితి తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలన్న పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ గెజిట్‌పై స్టేటస్ కో విధించింది.

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.