AP Local body Elections 2026 : ఏపీలో ఎన్నికల సందడి షురూ.. స్థానిక సమరానికి నేడే నగారా..! పూర్తి వివరాలు ఇలా..

AP Local body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్, నోటిఫికేషన్‌ను ఇవాళ విడుదల చేయనుంది.

AP Local body Elections 2026

AP Local body Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) ఉదయం 11.30 గంటలకు ఎస్ఈసీ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్‌తోపాటు.. మున్సిపల్ పోరుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. తొలుత మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.

Also Read : AP DSC Notification 2026 : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2,721 టీచర్‌ పోస్టులతో ప్రాథమిక నోటిఫికేషన్‌.. జిల్లాల వారిగా పోస్టుల వివరాలు ఇవే..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు నివేదించారు. మంగళవారం ఆయన లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బుధవారం షెడ్యూల్ జారీ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇవాళ ఉదయం 11.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎస్ఈసీ పునేఠా స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ తోపాటు.. మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌ల పరిధిలో 659 జడ్పీటీసీ స్థానాలకు, 9,848 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పురపాలక, పరిషత్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13,185 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలతో పాటు సుమారు 1.32 లక్షల వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను వచ్చే నెల 13 లేదా 16 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించి, డిసెంబరు 2 నుంచి ప్రారంభించి 14 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

ఎన్నికల విధానానికి సంబంధించి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే అవకాశం ఉండగా, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లను ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యుల ద్వారా ఎన్నుకోనున్నారు. అయితే ఎన్నికల తేదీలు, నోటిఫికేషన్లు, విడతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.