Kova Bun Vali: కోవా బన్ వలీకి అండగా నిలిచిన ఏపీ మంత్రి.. బన్ తినడమే కాదు ఆ సాయం కూడా..

చిరు వ్యాపారాలు చేసుకునే వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.

  • Updated on- February 19, 2026 / 12:40 AM IST

Kollu Ravindra Representative Image (Image Credit To Original Source)

 

  • కోవా బన్ వలీ, అతడి కుటుంబసభ్యులతో మాట్లాడిన మంత్రి
  • ధైర్యంగా ఉండాలని చెప్పిన మంత్రి కొల్లు రవీంద్ర
  • తాను మద్దతుగా ఉంటానని భరోసా
  • ఏ అవసరం ఉన్నా తన దగ్గరకు రావాలని సూచన

Kova Bun Vali: కోవా బన్ వలీకి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజల నుంచి వలీకి సపోర్ట్ లభిస్తోంది. తాజాగా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వలీకి మద్దతు తెలిపారు. ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తో కలిసి మంత్రి కొల్లు రవీంద్రను వలీ కలిశారు. వలీ, అతడి కుటుంబసభ్యులతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు.

వలీని ఆపాయ్యంగా పలకరించారు మంత్రి కొల్లు రవీంద్ర. వలీని అడిగి వివరాలు తెలుకున్నారు. మేడారం ఘటన తర్వాత తమ వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం పడిందని వలీ కుటుంబసభ్యులు మంత్రి దగ్గర వాపోయారు. తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మూడు తరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి బతుకుతున్న వారిపై విష ప్రచారం బాధాకరం అని మంత్రి కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వలీ తన వెంట తీసుకొచ్చిన బన్ తిని రుచి చూశారు మంత్రి. అంతేకాదు వలీ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు. శాలువా కప్పి వలీ, అతడి కుటుంబసభ్యులను సన్మానించారు మంత్రి కొల్లు రవీంద్ర. భయపడకుండా ధైర్యంగా ఉండాలని వారితో చెప్పారు. వ్యాపారానికి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా తన దగ్గరకు రావాలని, తాను అండగా ఉంటానని కోవా బన్ వలీకి భరోసా ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర.

మతం పేరుతో, పాపులారిటీ పేరుతో చిరు వ్యాపారులపై దాష్టీకం బాధాకరం అన్నారు. చిరు వ్యాపారాలు చేసుకునే వారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు. కాగా, ఇటీవలే ఎమ్మెల్సీ నాగబాబు సైతం వలీని కలిశారు. మేడారం ఘటన తర్వాత బాగా భయపడిపోయిన వలీలో ధైర్యాన్ని నింపేందుకే అతడిని పిలిపించి మాట్లాడానని నాగబాబు తెలిపారు.

మేడారం జాతరలో కర్నూలుకు చెందిన వలీ.. కోవా బన్ (10 రూపాయలు) అమ్ముతుండగా.. ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ ఓవరాక్షన్ చేశాడు. వలీని బాగా ఇబ్బంది పెట్టాడు. బన్నుల పై ఎక్స్ పైరీ డేట్ లేదని, కోవాలో ఏదో కలిపారని ఆరోపించాడు. ఆ కోవా బన్ తింటే ప్రాణాలకు ప్రమాదం అని వాగాడు. అంతేకాదు మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అంశంలో వలీకి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభించింది. అన్ని వర్గాల ప్రజలు వలీకి అండగా నిలిచారు. యూట్యూబ్ చానల్ రిపోర్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో పేద వాడి కడుపు కొట్టారని సీరియస్ అయ్యారు.