ఏపీ మంత్రి నారాయణ స్వామి నూతన మద్యం పాలసీ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏపీలో మంత్రి నారాయణ స్వామి మంగళవారం (అక్టోబర్ 1, 2019) నూతన మద్యం పాలసీ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు చేపట్టనున్నారు. షాపులలో ధరల పట్టిక ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మద్యం షాపులను 20 శాతం తగ్గించామన్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు. ప్రజలకు మద్యం దూరం చేయాలనే సంకల్పంతోనే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నాటు సారా తయారీని అరికడతామని చెప్పారు.
ప్రభుత్వం ఆధీనంలోనే మద్యం షాపులు నిర్వహించడం వల్ల బెల్ట్ షాపులు లేకుండా చేసి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్ షాపులకు తెర పడదు. అందుకే ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో దశల వారీగా సంపూర్ణమైన మద్య నిషేధం చేస్తామని ఎన్నికల సందర్భంగా జగన్ హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్న బెల్టుషాపులపై కొరఢా ఝులిపించారు. వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.