Janga Krishna Murthy: టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి బిగ్ ప్లాన్? టీటీడీ బోర్డ్ మెంబర్ పదవికి రాజీనామా అందుకేనా?
ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఫస్ట్ టైమ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు.
Janga Krishna Murthy
- చిన్న విమర్శ రాగానే పదవిని వదులుకుంది అందుకేనా?
- పెద్దల సభకు వెళ్లే ప్లాన్‌లో భాగంగానే ట్విస్ట్ ఇచ్చారా?
- ఎమ్మెల్యే టికెట్ దక్కకపోతే రాజ్యసభకు పంపాలని రిక్వెస్ట్..!
Janga Krishna Murthy: చిన్న ఆరోపణ..ఆ వెంటనే రిసిగ్నేషన్. అయ్యో ఆ అలిగేషన్‌కే పదవికి రిజైన్ చేస్తారా? అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. తన నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నారు. ఆ క్రమంలోనే ఆ పోస్ట్‌ను వదులుకున్నారు. కానీ ఆయన రిజైన్ వెనుక పెద్ద రీజనే ఉందట. పెద్దల సభకు వెళ్లే ఆలోచనలోనే ఆయన ఆ పదవికి రిజైన్ చేశారట. ఇంతకు ఎవరా నేత? ఆయన ప్లానేంటి? ముందస్తు వ్యూహం ప్రకారమే ఆయన పదవిని వదులుకున్నారా?
టీడీపీ బోర్డు సభ్యత్వానికి రిజైన్ చేసిన పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి టీడీపీ రాజకీయాల్లో హీట్ పుట్టించారు. గత ఎన్నికలకు ముందు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతో కలిసి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి కూటమి ప్రభుత్వంలో టీటీడీ సభ్యుడిగా నియమితులయ్యారు. రాజకీయంగా ఏడాదిన్నరగా అంతా సజావుగా ఉందన్న సమయంలో ఆయన సడెన్‌గా తన టీటీడీ సభ్యత్వానికి రిజైన్ చేయడం చర్చకు దారితీసింది. దీనికి కారణం ఆయనకు చెందిన ట్రస్టుకు భూకేటాయింపులను తప్పుబడుతూ సీఎం చంద్రబాబు క్యాబినెట్‌లో చేసిన వ్యాఖ్యలే అన్న టాక్ వినిపించింది.
జంగా కృష్ణమూర్తికి భూములు కేటాయించలేమని చెప్పడంపై ఆయన ఫీల్ అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు రావడం కలకలం రేపాయి. ఈ పరిణామాలతో పల్నాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీంతో సీఎం చంద్రబాబు జంగా కృష్ణమూర్తికి ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన ఆయన అప్పట్లో ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు. ఫస్ట్ టైమ్ టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆయనకు తిరుమల కొండపై భూమి కేటాయించినట్లు చెబుతున్నారు. అయితే అప్పట్లో ఆయన ఆ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయలేదట. ఇక 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా, టీటీడీ సభ్యుడిగా వ్యవహరించారు. ఈ సమయంలో తిరుమల కొండ మీదున్న తన భూమిలో భవన నిర్మాణాలకు ప్రయత్నించారు. ఇందుకోసం టీటీడీకి కొంత మొత్తం డిపాజిట్ చేసినట్లు చెబుతున్నారు.
అయితే 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరడంతో అప్పటి ప్రభుత్వం జంగాకు కేటాయించిన భూములను రద్దు చేసిందట. తనకు మళ్లీ భూములు కేటాయించేందుకు టీటీడీ తీర్మానం చేయగా..ఓ న్యూస్ పేపర్‌లో వచ్చి వార్త ఆధారంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం జంగా కృష్ణమూర్తికి మనస్తాపం కలిగించాయట.
జంగా రిజైన్ వెనక పెద్ద స్కెచ్..?
అయితే ఒక చిన్న ఆరోపణ రాగానే ఆయన పదవి నుంచి తప్పుకోవడం చర్చకు దారి తీయగా..ఆయన రిజైన్ వెనక పెద్ద స్కెచ్చే ఉందన్న చర్చ జరుగుతోంది. బీసీ కోటాలో రాజ్యసభ రేసులోకి దూసుకొచ్చారట జంగా కృష్ణమూర్తి. ఇప్పటికే ఆయన ఈ దిశగా అధినాయకత్వానికి సంకేతాలు పంపించారని అంటున్నారు. టీటీడీ బోర్డు మెంబర్‌కు రాజీనామా చేయడానికి వేరే కారణాలు ఉన్నాయని అని ప్రచారంలో ఉన్నా..ఆయన డబుల్ ప్లాన్‌లో భాగంగానే రిసిగ్నేషన్ అస్త్రాన్ని వాడారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
గురజాల ఎమ్మెల్యే సీటుపై కన్ను..!
2029 ఎన్నికల్లో గురజాల ఎమ్మెల్యే సీటు కావాలని కోరుతున్నారట జంగా కృష్ణమూర్తి. అది మాత్రం జరిగేలా లేదని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనేకసార్లు గెలిచిన యరపతినేని శ్రీనివాసరావును కాదని జంగాకు టికెట్ ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దాంతో జంగా కృష్ణమూర్తి రాజ్యసభ రేసులోకి వస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోతే రాజ్యసభకు పంపితే తనకు న్యాయం జరుగుతుందని రిక్వెస్ట్ చేస్తున్నారట.
ఇప్పటికే చాలా మంది నేతలు టీడీపీ రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతుండగా..జంగా కృష్ణమూర్తి కూడా పెద్దల సభ సీటు రేసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. అయితే జంగాను టీటీడీ బోర్డు మెంబర్‌గానే కంటిన్యూ చేస్తారా లేక రాజ్యసభ పంపిస్తారా అనేది చర్చనీయాంశం అవుతోంది. అయితే ఆయన బీసీ వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేయొచ్చని అంటున్నారు. ఆయన అసంతృప్తికి టీడీపీ అధిష్టానం ఎలా చెక్ పెట్టబోతుందో చూడాలి.
