Vasamsetti Subash : రైతుల పేరుతో రాజకీయాలు వద్దు.. వైఎస్ జగన్‌కు మంత్రి సుభాష్ కౌంటర్!
Vasamsetti Subash : రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు.
- Sreehari A
- Published on- August 5, 2026 / 03:22 PM IST
Vasamsetti Subash
- కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు
- వైసీపీ పాలనలో రైతులపై పూర్తిగా నిర్లక్ష్యం
- రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ దేవరపల్లి పర్యటన
Vasamsetti Subash : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేవరపల్లి పర్యటనపై ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ పర్యటించారని ఆయన ఆరోపించారు.
పొగాకు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే చూపించాల్సిందని విమర్శించారు. ఇప్పుడు ముసలి కన్నీళ్లు కార్చడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ఏ ముఖం పెట్టుకుని గోదావరి జిల్లాకు వచ్చారో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
25 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేశాం :
వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చారని ప్రజలు భావిస్తే.. చివరికి రైతులను మభ్యపెట్టే ప్రయత్నమే చేశారని మంత్రి వాసంశెట్టి విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
Read Also : TGSRTC : హైదరాబాద్‌లో కొత్త మినీ బస్సులు.. తెలంగాణ సర్కార్ సూపర్ ప్లాన్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
అప్పట్లో కేవలం 12.9 మిలియన్ కిలోల పొగాకే కొనుగోలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, కూటమి ప్రభుత్వం 25 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు.
హెచ్‌డీ బర్లీ రైతులకు రూ.270 కోట్ల ఆర్థిక సాయం అందించామన్నారు. ఆఫ్ స్టైల్ పొగాకుకు కిలోకు రూ.10 ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. పొగాకు రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల సాయం అందిస్తోందని చెప్పారు.
రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, యుద్ధ ప్రభావంతో పొగాకు ధరలు తగ్గినా రైతులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సుభాష్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలను రాజకీయాల కోసం వాడుకోవడం వైసీపీకి అలవాటైందని విమర్శించారు.
