AP MPTC-ZPTC Elections : ఏపీలో ముగిసిన పరిషత్ ఎన్నికల పోలింగ్.. పలుచోట్ల వాగ్వాదాలు.. తోపులాటలు..!

AP MPTC-ZPTC Elections : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 28 జడ్పీల పరిధిలో 582 జడ్పీటీసీ స్థానాలు, 659 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్ పూర్తయింది. పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

AP MPTC-ZPTC Elections

  • 582 జడ్పీటీసీ, 7787 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
  • 28 జడ్పీల పరిధిలో 582 స్థానాలకు పోలింగ్ పూర్తి
  • 659 మండలాల్లో 7767 ఎంపీటీసీ స్థానాలకు ఓటింగ్
  • స్వల్ప ఘటనలు మినహా ముగిసిన పోలింగ్
  • క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం

AP MPTC-ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి కొనసాగిన ఓటింగ్ ప్రక్రియ స్వల్ప ఘటనలు, అక్కడక్కడా చోటుచేసుకున్న వాగ్వాదాలు, తోపులాటల మధ్య పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల దగ్గర సందడి కనిపించింది..

పోలింగ్ శాతం ఎంతంటే? :
రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌ల పరిధిలోని 582 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అలాగే 659 మండలాల్లో 7,787 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. అయితే, అందిన సమాచారం ప్రకారం.. 7,767 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 58.55 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

చివరి నిమిషం వరకు రద్దీ :
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి నిమిషం వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల రద్దీ కనిపించింది.

Read Also : AP MPTC-ZPTC Elections : ఏపీలో ప్రశాంతంగా పోలింగ్.. ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే?

పలుచోట్ల ఉద్రిక్తతలు :
మరోవైపు పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండానే పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

మొత్తానికి చెదురుమదురు ఘటనలు మినహా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపైనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..