AP Rains
AP Rains: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, రాబోయే నాలుగైదు రోజుల్లో ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందని, ఈనెల 24వ తేదీ తరువాత బంగాళాఖాతంలో తుపాను ఏర్పడటానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 24వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతోందని, 26వ తేదీన అల్పపీడనంగా మారి.. ఆ తరువాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని, ఈ క్రమంలో వాయుగుండం 27వ తేదీ నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల ప్రభావంతో కొద్దిరోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
శనివారం ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6గంటల వరకు కాకినాడ జిల్లా రాయభూపాలపట్నంలో 74.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రౌతులపూడిలో 57.7మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా ఉలవపాడులో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది.
వర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందవద్దు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన కోరారు.