AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన.. కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన లారీ..
AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
- Harish Thanniru
- Updated on- July 28, 2026 / 07:40 AM IST
AP Road Accident
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం
- చెల్లూరు జాతీయ రహదారిపై ప్రమాదం
- దైవదర్శనానికి వెళ్తుండగా ఘటన
AP Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో 13మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. విజయనగరం మండలం చెల్లూరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట, డెంకాడ మండలం బొడ్డవలస, విజయనగరం మండలం చెల్లూరుకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన 16మంది రాయగడలో దైవదర్శనానికి వెళ్లేందుకు బొలెరో వాహనాన్ని బుక్ చేసుకున్నారు. బొచ్చపేట నుంచి బయలుదేరిన వాహనంలో అయినాడ కూడలి వద్ద బొడ్డవలసకు చెందిన కొంతమంది ఎక్కారు. ఆ తరువాత చెల్లూరు దగ్గర జాతీయ రహదారి పక్కన వాహనంను ఆపారు. ఈ సమయంలో విశాఖపట్టణం నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఆగిఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. కొద్దిదూరం వరకు వాహనంను ఈడ్చుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో బాలుడితోపాటు ముగ్గురు అక్కడిక్కకడే మరణించారు.
మరణించిన వారిలో చింతపల్లి రాంబాబు అలియాస్ రామునాయుడు (50), మజ్జి నారాయణరావు (50), బి. మోహననాయుడు (8) అక్కడికక్కడే మరణించారు. మరో 13మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా దినసరి కూలీలే. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మూడు కుటుంబాల వారు దైవదర్శనానికి వెళ్తుండగా.. మృత్యువు ముగ్గురిని బలిగొనడంతో కుటుంబ సభ్యులు బోరనవిలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
