sec-nimmagadda-ramesh-kumar
polling timings in panchyat elections: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయం విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
కాగా.. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించారు. మధ్యాహ్నం 1.30 కే పోలింగ్ ముగియనుంది. రంపచోడవరంలోని 7 మండలాలు, ఎటపాక డివిజన్ లో 4 మండలాల్లో పోలింగ్ సమయం కుదించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు ఏజెన్సీల్లో పోలింగ్ సమయాన్ని కుదిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఆరున్నకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 3.30గంటలకు ముగుస్తుంది. ఈ మేరకు ఎస్ఈసీ కొత్తగా ఆదేశాలు జారీ చేశారు.
ఇక పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ నెల(ఫిబ్రవరి) 9, 13,17,21 తేదీల్లో సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఆయా తేదీల్లో ఎక్కెడక్కడ పోలింగ్ జరుగుతుందో ఆ ప్రాంతాల్లో సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవులు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ భవనాలను పోలింగ్ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
ఎన్నికలు జరిగే రోజుల్లో ఉద్యోగులకు ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, 1988 ప్రకారం చెల్లింపులతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. పోలింగ్ జరిగే తేదీలకు 44 గంటలకు ముందు ఆయా ప్రాంతాలలో మద్యం షాపులు మూసి వేయాలని ఉత్తర్వు జారీ చేశారు. అలాగే ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని ఉత్తర్వు ఇచ్చింది. ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపింది. ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వపరంగా మొత్తం తొమ్మిది జీవోలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఇదివరకే వేర్వేరుగా జారీ చేశారు.
పోలింగ్ బాక్సులు, సిబ్బందిని పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరవేసేందుకు భారీగా వాహనాలు అవసరమైనందున పలు ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలు వినియోగించుకునేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.