Lakshminarasimha Swamy Temple : అరటి గెల కడితే చాలు..కోరిన కోర్కెలు తీర్చే..చెట్లతాండ్ర లక్ష్మీనృసింహ స్వామి..

కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటి గెలలు కట్టడం చూశారా..! ఆ స్వామి సన్నిధిలో ఏదైతే కోరుకున్నామో అది జరిగిందని.. ఆనందంతో అరటి గెలలు సమర్పించడం గురించి విన్నారా..! ఇదిగో ఈ ఆలయంలో గత 80 ఏళ్ల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.

Lakshminarasimha Swamy Temple Srikakulam  : ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు భక్తులు పత్రం, ఫలం, పుష్పం ఏదో ఒకటి తీసుకెళ్తుంటారు. తాము కోరిన కోర్కెలు తీరితే కోళ్లు, మేకలు బలిస్తుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఓ ఆలయంలో వింత సంప్రదాయం ఉంది. అనుకున్నది జరిగితే అయ్యగారికి అరటి గెల సమర్పిస్తారు. అందుకే అయ్యగారి ఆలయంలో ఎక్కడ చూసినా అరటి గెలలే వేలాడుతూ కనిపిస్తాయి.

సాధారణంగా దేవుడి సన్నిధిలో మనం ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరిక నెరవేరాలని ముడుపులు కట్టడం చూస్తుంటాం. కానీ కోరిన కోరికలు నెరవేరాలని ఎప్పుడైనా గుడిలో అరటి గెలలు కట్టడం చూశారా..! ఆ స్వామి సన్నిధిలో ఏదైతే కోరుకున్నామో అది జరిగిందని.. ఆనందంతో అరటి గెలలు సమర్పించడం గురించి విన్నారా..! ఇదిగో ఈ ఆలయంలో గత 80 ఏళ్ల నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, చెట్లతాండ్ర గ్రామంలో లక్ష్మీనృసింహ స్వామి కొలువయ్యారు. ఉద్యోగం కావాలన్నా.. పెళ్లి జరగాలన్న.. పిల్లలు కలగాలన్న ఇలా భక్తులు కోరిన కోర్కేలు తీరాలంటే ఒక్క అరటి గెలచాలు.. కోర్కెలు ఇట్టే తీరిపోతాయని భక్తులు నమ్మకం. ఎక్కడైనా దేవుడికి అరటి పళ్లు పెట్టడం సాధారణమే అయినా ఇక్కడ ఏకంగా గెలకు గెలే పెడతారు. అందుకే ఆలయ ప్రాంగణమంతా అరటి సువాసనలతో నిండిపోతుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మొదటగా ఈ అరటి గెలలే స్వాగతం పలుకుతాయి.

లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న రావి చెట్టు పక్కన వేసిన పందిర్లకు అరటి గెలలు కడితే కోరిన కొర్కేలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి స్వామికి అరటి గెలలు కడుతుంటారు. చెట్లతాండ్ర ఓ సాదాసీదా గ్రామం. కానీ ఇక్కడున్న ఆలయంతో ఈ గ్రామం ఫేమస్ అయిపోయింది. 170 ఏళ్ల కిందట ఈ గ్రామానికి వచ్చిన స్వామీజీ పేరే పరవస్తు అయ్యవారు. అరటి గెలల సంప్రదాయానికి మూల కారణం ఆయనే. 170 ఏళ్ల కిందట ఆయన ఈ గ్రామానికి వచ్చారు. అయ్యగారు నిత్యం లక్ష్మీనృసింహ స్వామిని ఆరాధించేవారు. 45 ఏళ్ల పాటు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాదు అక్షయ పాత్రతో ప్రసాదాలు ఇచ్చే వారని భక్తులు చెబుతుంటారు. 45 ఏళ్ల కైంకర్యాల తర్వాత ఆయన అక్కడే జీవ సమాధి పొందారు. ఆ ప్రదేశంలోనే ఓ మర్రిచెట్టు పుట్టింది. దాన్నే అయ్యగారి స్వరూపంలో భావించి లక్ష్మీ నృసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తూ వస్తున్నారు.

80 ఏళ్ల కిందట అరటి గెలలను కట్టడం ప్రారంభించారు. ఆ సంప్రదాయం అలా ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. భీష్మ ఏకాదశి ఇక్కడ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది.భీష్మ ఏకాదశి రోజున ఏకంగా భక్తులు 8వేల గెలలు కట్టారంటే ఏ స్థాయిలో అక్కడికి తరలివస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఇందులో ఒక్క అరటి గెల కూడా మిస్ కాదు.కొందరు మూడు రోజుల తర్వాత ఈ అరటి గెలలు స్వామి ప్రసాదంగా భావించి తీసుకెళ్తుంటారు. మరికొందరు అక్కడే వదిలేస్తారు.ఏటా భీష్మ ఏకాదశి నుంచి మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఒడిశా రాష్ట్రం నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. తమ కోర్కెలు నెరవేరాలని అరటి గెలలు కడుతుంటారు.

 

ట్రెండింగ్ వార్తలు