సీతయ్యలుగా మారిన సభాధిపతులు : ఎవ్వరి మాట వినరు

  • Publish Date - January 23, 2020 / 03:36 AM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శానస మండలి సభాధిపతులు సీతయ్యలుగా మారిపోయారు. ఎవరి మాటా వినడం లేదు. సభ్యులకు క్లాస్‌లు పీకుతున్నారు. అంతేకాదు.. ఏకంగా మంత్రులకే ఝలక్‌లిస్తున్నారు. భావోద్వేగాలకు అతీతంగా ఉండాల్సిన సభాధిపతులే…. అప్పుడప్పుడు అసహనానికి గురవుతున్నారు. సభ్యులపై కోపగించుకుంటున్నారు. సభ్యుల తీరుతో మనస్తాపానికి గురై… నిండు సభ నుంచి నిష్క్రమిస్తున్నారు. 

సభాధిపతులకు ఎంతో ఓపిక, సహనం ఉండాలి:
చట్ట సభలను నడపడం అంటే మామూలు విషయం కాదు. సభను నడిపించే స్పీకర్లకు, చైర్మన్‌ లకు ఎంతో ఓపిక ఉండాలి. సభ్యులు ఎంతలా వాదులాడుకున్నా… వారిని సముదాయించాలి. సభ్యులు స్పీకర్‌కు చికాకు కలిగించినా.. కోపం తెప్పించినా ఎట్టి పరిస్థితిలోనూ కోపగించుకోవద్దు. సభను నడిపే వారు ఎల్లప్పుడూ సంయమనం పాటించాలి. సభా మర్యాదలు పాటించకుంటే సభ్యులను హెచ్చరించే అధికారం కూడా ఉంటుంది. సభను నడిపే భావోద్వేగాలకు ఎంతలా దూరంగా ఉంటే… సభ అంత హుందాగా జరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సభాధిపతి తరగతి గదిలో టీచర్‌లా ఉండాలి. అందరినీ కంట్రోల్‌ చేయగలగాలి.

టీచర్ లా కాకుండా హెడ్ మాస్టర్ లా వ్యవహరిస్తున్నారు:
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌, శానస మండలి చైర్మన్‌లు మాత్రం హెడ్‌ మాస్టర్‌లా ప్రవర్తిస్తున్నారు. స్పీకర్‌ ప్రతిపక్ష సభ్యులకు క్లాస్‌ పీకితే…. మండలి చైర్మన్‌ ఏకంగా మంత్రులకే ఝలక్‌ ఇచ్చారు. ఇద్దరు కూడా ఎవరి మాటా వినరు. అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులకు క్లాస్‌ తీసుకున్నారు. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు.. స్పీకర్‌.. మంత్రిగా వ్యవహరిస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై సభాధిపతి సీరియస్‌ అయ్యారు. అది కూడా అవుతానని కౌంటర్‌ ఇచ్చారు. అంతేకాదు.. ప్రతిపక్ష సభ్యులు హద్దులు దాటుతున్నారని కోపగించుకున్నారు.

సభ నుంచి స్పీకర్ వాకౌట్:
మరుసటి రోజు టీడీపీ సభ్యులు అమరావతిపై చర్చించాలని స్పీకర్‌ను పట్టుబట్టారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చకు స్పీకర్ అనుమతించగా… అది కాదని అమరావతిపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఎంతసేపటికీ టీడీపీ సభ్యులు శాంతించకపోవడంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన స్పీకర్… సభ నుంచి వెళ్లిపోయారు. ఐ యామ్‌ సారీ…. ఐ యామ్‌ ప్రొటెస్టింగ్‌ ది ఆటిట్యూడ్‌ ఆఫ్‌ టీడీపీ ఎమ్మెల్యేస్‌… అంటూ సభ నుంచి నిష్క్రమించారు. స్పీకరే వాకౌట్‌ చేయడంతో అసెంబ్లీలో సభ్యులంతా షాకయ్యారు.

మంత్రులకు బయటకు పంపిన చైర్మన్:
ఇక శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ కూడా హెడ్‌ మాస్టర్‌ లా వ్యవహరిస్తున్నారు. ఆయన ఏకంగా మంత్రులకే ఝలక్‌ ఇచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై మండలిలో చర్చ వాడీవేడీగా జరుగుతున్న సమయంలో…. సెలెక్ట్‌ కమిటీకి వాటిని పంపే అంశంపై ఓటింగ్‌ జరపాలని యనమల కోరారు. అక్కడే ఉన్న మంత్రి బుగ్గన సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని అన్నారు.  ఓటు హక్కు లేని వాళ్లను బయటకు పంపాలని చైర్మన్‌ను టీడీపీ ఎమ్మెల్సీలు కోరారు. దీంతో చైర్మన్‌ పోడియం దగ్గరికి 20మంది మంత్రులు వెళ్లారు. దీంతో వారిని బయటకు పంపాలని చైర్మన్‌ ఆదేశించారు. చైర్మన్‌ నిర్ణయంతో సభ్యులంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.