గత పదేళ్లలో బాలయ్యలో ఎప్పుడూ చూడని మార్పు.. హిందూపురం టీడీపీలో కీలక పరిణామాలు

పార్టీ క్యాడర్ మొత్తం పీఏలు, ఒకరి ఇద్దరు ముఖ్య నాయకులపై ఆధార పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తమకు ఏ పని కావాలన్నా బాలకృష్ణతో నేరుగా అడిగే పరిస్థితి ఎవరికీ లేదు. పలానా పదవి కావాలని అడగాలన్నా బాలకృష్ణ వద్ద భయపడే పరిస్థితి ఉంది. చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ బాలయ్య వద్ద ఏదీ ఓపెన్ గా మాట్లాడలేని పరిస్థితి ఉంది.

Balakrishna : నాకు ఒకరు ఎదురొచ్చినా వారికే రిస్క్.. నేను ఇంకొకరికి ఎదురు వెళ్లినా వారికే రిస్క్.. ఇది నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్. రీల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఆయన అలానే కనిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా పొలిటికల్ లైఫ్‌లో తిరుగులేని విజయాలతో ఉన్న బాలయ్యను టార్గెట్ చేస్తోంది వైసీపీ. నీకు ఎదురు రావడమే కాదు.. టీడీపీ కుంభ స్థలాన్ని కొట్టేస్తామంటూ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా అనంతపురం బాధ్యతలు చూస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. హిందుపురంను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం కాకపుట్టిస్తోంది. వైసీపీ సెగ గట్టిగా తాకిందేమో.. బాలకృష్ణ కూడా చలో హిందూపురమంటూ నియోజకవర్గంలో పర్యటనలకు శ్రీకారం చుట్టారు.

బాలయ్యకు వైసీపీ టెన్షన్..
వెండితెరపై వరుస హిట్లతో దూసుకుపోతున్న సినీనటుడు నందమూరి బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా కూడా పాలిటిక్స్‌లోనూ వరుస సక్సెస్‌లు అందుకున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో సీఎం జగన్ వేవ్ ఉన్నప్పటికీ తట్టుకుని నిలవడమే కాకుండా.. గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొంది రికార్డ్ క్రియేట్ చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా.. బాలయ్య ఎప్పుడూ పాలిటిక్స్‌ను సీరియస్‌గా తీసుకోలేదని గత పదేళ్లలో ఆయన రాజకీయ కార్యక్రమాలు చూస్తే తెలుస్తోంది. కానీ, మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన బాలయ్యకు ఇప్పుడు అధికార వైసీపీ టెన్షన్ పెడుతోంది.

3 నెలల ముందే మకాం..
నియోజకవర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని ఫ్యాన్ పార్టీ పావులు కదుపుతుండటంతో బాలయ్య కూడా అలర్ట్ అయ్యారంటున్నారు. 2014, 19 ఎన్నికల్లో కేవలం నెల రోజులు మాత్రమే ప్రచారం చేసిన బాలయ్య.. ఇప్పుడు ఏకంగా మూడు నెలల ముందే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య రెండు రోజులు హిందూపురంలోనే మకాం వేసిన బాలయ్య పార్టీ పరిస్థితులపై స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమై సూచనలు, సలహాలిచ్చారు.

ఎవరితోనూ పెద్దగా టచ్ లో ఉండరు..
వాస్తవంగా బాలకృష్ణ హిందుపురం తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ పెద్దగా టచ్ లో ఉండరు. కేవలం తన పీఏల ద్వారానే పాలన సాగిస్తున్నారు. 2014 – 19 మధ్య టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పీఏల పాలన చెల్లింది. కానీ గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ బాలయ్యలో ఛేంజ్ లేదు. కేవలం చుట్టపు చూపుగానే హిందూపురం నియోజకవర్గానికి వచ్చి వెళ్లేవారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన ఏవైనా శుభకార్యాలు ఉంటే ఆయన ముందస్తుగా ప్లాన్ చేసుకొని హిందూపురం వచ్చేవారు.

Also Read : లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్‌ కానుక వెనుక లాజిక్‌ ఏంటి? ఏపీలో రాజకీయ తుఫాన్‌కు ముందస్తు హెచ్చరికలా!

బాలయ్య అంటే భయం..
సినిమా షూటింగ్ గ్యాప్ ఉంటే తప్ప హిందూపురం వైపు చూసే వారు కాదు. దీంతో పార్టీ క్యాడర్ మొత్తం పీఏలు, ఒకరి ఇద్దరు ముఖ్య నాయకులపై ఆధార పడాల్సి వస్తోంది. ముఖ్యంగా తమకు ఏ పని కావాలన్నా బాలకృష్ణతో నేరుగా అడిగే పరిస్థితి ఎవరికీ లేదు. పలానా పదవి కావాలని అడగాలన్నా బాలకృష్ణ వద్ద భయపడే పరిస్థితి ఉంది. చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ బాలయ్య వద్ద ఏదీ ఓపెన్ గా మాట్లాడలేని పరిస్థితి ఉంది.

టీడీపీ క్యాడర్‌లో అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో..
టీడీపీ క్యాడర్‌లో ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునే పనిలో పడింది వైసీపీ. నియోజకవర్గ వైసీపీలో అంత అనుకూలమైన పరిస్థితులు లేనప్పటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందుపురం నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీలో నాలుగు గ్రూపులను సమన్వయ పరిచేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి.. నియోజకవర్గ ఇన్‌చార్జి దీపికను ముందుపెట్టి ఆపరేషన్ హిందుపురంపై చకచకా అడుగులు వేస్తున్నారు.

కుప్పంలో చంద్రబాబును టార్గెట్ చేసి.. మున్సిపల్ ఎన్నికల్లో స్వీప్ చేసిన వైసీపీ.. అదే తరహా రాజకీయాన్ని హిందుపురంలో ప్రయోగించేందుకు పావులు కదుపుతోంది. ఇక ఆపరేషన్ హిందూపురంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రెండు రోజులు పాటు నియోజకవర్గంలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పెద్దిరెడ్డి మనుషులు హిందూపురంలో అడుగుపెట్టి పార్టీని చక్కదిద్దే పని స్టార్ట్ చేశారు.

అలర్ట్ అయిన బాలయ్య.. వెంట రంగంలోకి..
టీడీపీలో అసంతృప్తులను చేరదీసి.. వచ్చే ఎన్నికల్లో విక్టరీ కొట్టాలనే స్కెచ్ వేస్తున్నారు. వారం పది రోజుల్లో కీలక పరిణామాలు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అలర్ట్ అయ్యారు. అందుకే చెప్పా పెట్టకుండా నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి పార్టీని చక్కదిద్ది.. కార్యకర్తలు, నాయకులకు భరోసాగా.. అండగా నిలుస్తానని హామీలిచ్చారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడి భవిష్యత్‌పై హామీలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ పదేళ్లలో ఎన్నడూ బాలయ్య ఇలాంటి సమావేశాలు నిర్వహించకపోవడం.. ఇప్పుడు అకస్మాత్తుగా దిగువస్థాయి నేతలు, కార్యకర్తలతో రహస్య మంతనాలు సాగిస్తుండటం చూస్తే ఎవరికీ భయపడని బాలయ్యను పెద్దిరెడ్డి భయపెట్టారా? అన్న టాక్ నడుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు