ఏపీ టీడీపీకి కొత్త బాస్…తెలంగాణకు రమణ కంటిన్యూ

Atchannaidu appointed AP TDP president ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి,టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు కొనసాగుతుండగా ఆయన స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. 27 మంది సభ్యులతో ఆ పార్టీ కేంద్ర కమిటీని, మరో 25 మందితో పొలిట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు. 31 మందితో టీటీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయగా టీటీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా ఆరుగురిని నియమించారు.



జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగనుండగా.. ఆరుగురిని ఉపాధ్యక్షులుగా నియమించారు. పార్టీ సీనియర్‌ నేతలు కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణ కుమారి, డీకే సత్యప్రభతోపాటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కాశీనాథ్‌కు అవకాశం కల్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్‌ నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.



తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన అచ్చెన్నాయుడు, తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులుగా మరోసారి ఎన్నికైన ఎల్.రమణ గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ, సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో మరియు ఇతర పదవులకు ఎన్నికైన తెలుగుదేశం నేతలందరికీ పేరుపేరునా హార్దికాభినందనలు. సామాజిక న్యాయం పాటిస్తూ కేటాయింపులు జరిగినప్పటికీ. ఈ పదవులు పార్టీకి అంకితభావంతో మీరు అందిస్తోన్న సేవలకు, మీ సమర్థతకు నిదర్శనాలు అని లోకేష్ మరో ట్వీట్ లో తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ పార్టీని మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు మీరంతా కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. పార్టీ గెలుపే మన లక్ష్యం కావాలని లోకేష్ ట్వీట్ చేశారు.