Jogi Ramesh: విజయవాడ ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి ఇంటిపై దాడి జరిగింది. తొలుత ఇంటిపై రాళ్ల దాడి చేశారు. తర్వాత నిప్పు పెట్టారు. మొదటి అంతస్తు మంటల్లో కాలిపోతోంది. మంత్రి నారా లోకేశ్ పై జోగి రమేశ్ నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జోగి రమేశ్ ఇంటి వద్దకు వెళ్లాయి. రాళ్ల దాడి చేయటమే కాకుండా జోగి రమేశ్ ఇంటికి నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే, దాడి సమయంలో జోగి రమేశ్ కుటుంబం ఇంట్లో లేదని తెలుస్తోంది.
టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున జోగి రమేశ్ నివాసం దగ్గరికి చేరుకున్నాయి. మొదట రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేశారు. తర్వాత మొదటి అంతస్తుకు నిప్పు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. బిల్డింగ్ మొత్తం పొగ కమ్మేసింది. అయితే, ఆ సమయంలో జోగి రమేశ్ కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఎవరూ ఆ ఇంట్లో లేరు. నిన్న మైలవరంలో జరిగిన వైసీపీ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. నిరసనగా జోగి రమేశ్ ఇంటిపైకి దూసుకొచ్చారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న గుంటూరులో అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్ పైనా దాడి జరిగిన సంగతి తెలిసిందే. కారు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
తన ఇంటిపై రాళ్ల దాడి చేయడమే కాకుండా నిప్పు పెట్టిన ఘటనపై జోగి రమేశ్ తీవ్రంగా స్పందించారు. తన ఇంటి దగ్గర అంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో విధ్వంసం, దహన కాండలు చూస్తున్నామన్నారు. అంబటి రాంబాబుపై దాడి మరిచిపోక ముందే బలహీన వర్గాలకు చెందిన నా ఇంటిపై దాడి చేశారని వాపోయారు. నన్ను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న గంజాయి బ్యాచ్ దింపి ఇలా చేస్తున్నారని జోగి రమేశ్ ఆరోపించారు.
ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాపై దాడులు చేస్తే మేము వైసీపీ జెండా వదిలేస్తాం అనుకుంటున్నారా? అని అడిగారు. అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాము అనుకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. ”ఏడాదిన్నరలోనే మీరు హద్దు మీరారు. మీరే సీఎం అని కలలు కంటున్నారు. ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. లోకేశ్ నీ పిల్ల చేష్టలు మానుకో” అని జోగి రమేశ్ మండిపడ్డారు.
”ఇంట్లో నాన్న, పిల్లలు ఉన్నారు. పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. ఇలా జరగవచ్చని ముందే నేను అధికారులకు చెప్పాను. అయినా అంతా ప్రేక్షక పాత్ర పోషించారు. మీ తప్పులు ఎత్తి చూపితే ఇలా చేస్తారా? తిరుపతికి వచ్చే ముందే స్థానిక పోలీస్ అధికారులకు చెప్పాను. నేను ముందే చెప్పినా ఇలా జరిగింది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీ, గూండాలతో ఇలా చేయించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దని లోకేశ్ ను హెచ్చరిస్తున్నా. మిమ్మల్ని పిచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టిస్తాను” అని జోగి రమేశ్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: రాజకీయ కక్షతోనే మా వాళ్లపై దాడులు.. పోలీసులతో సహా ఎవరినీ వదలం- సజ్జల వార్నింగ్