Sajjala Ramakrishna Reddy: రాజకీయ కక్షతోనే మా వాళ్లపై దాడులు.. పోలీసులతో సహా ఎవరినీ వదలం- సజ్జల వార్నింగ్
కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. గూండాలకు పోలీసులు రక్షణ ఇచ్చారు.
Sajjala Ramakrishna Reddy
- ప్రైవేట్ సైన్యంతో ప్రత్యర్థులను, అమాయకులు, ప్రశ్నించిన వాళ్లపై దాడులు
- తిరుపతి లడ్డూ విషయంలో టీడీపీ అసత్య ప్రచారాలు చేసింది
- కేంద్ర హోంశాఖ మంత్రిని కలుస్తాం, కేసులు వేస్తాం, కోర్టుల్లో తేల్చుకుంటాం
Sajjala Ramakrishna Reddy: గుంటూరులోని అంబటి రాంబాబు ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారు. సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి విడదల రజని, అప్పిరెడ్డి, మోదుగుల.. అంబటి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంబటి రాంబాబు ఇంట్లో పగిలిన కిటికీ అద్దాలు, పూల కుండీలు, రాళ్లు, కర్రలను పరిశీలించారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వంపై సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో సహా ఎవరినీ వదిలేది లేదని, అందరిపైనా కేసులు వేస్తామని సజ్జల హెచ్చరించారు.
”అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడి చేశారు. 5 గంటల పాటు విచక్షణారహితంగా విధ్వంసం చేశారు. కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. గూండాలకు పోలీసులు రక్షణ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ సైన్యంతో ప్రత్యర్థులను, అమాయకులను, ప్రశ్నించిన వాళ్లను అణగదొక్కుతోంది. దాడులకు తెగబడుతోంది. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? కూటమికి అధికారం ఇచ్చింది ఇందుకేనా? తిరుపతి లడ్డూ విషయంలో టీడీపీ అసత్య ప్రచారాలు చేసింది. ల్యాబ్ లో అబద్ధం అని తేలింది. లడ్డూ విషయంపై సీఎం చంద్రబాబు ఇంతవరకు మాట్లాడలేదు. లడ్డూ కల్తీ నిజం అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. టీడీపీ వేసిన ఫ్లెక్సీలలో ఫోటోలు ఎవరివి వేశారు? మా పార్టీ వాళ్ళవి కాదా? అసత్యం కాదా?
నిన్న జరిగింది క్లియర్ గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అటెంప్ట్..!
అంబటి రాంబాబుపై పధకం ప్రకారం మర్డర్ అటెంప్ట్ జరిగింది. అవునా? కాదా? శాంతి భద్రతల సమస్య రాకూడదనే జగన్ వస్తానంటే వద్దన్నాం. న్యాయ పోరాటం చేస్తాం. దీనికి కారణమైన పోలీసులను కూడా వదిలిపెట్టం. నిన్న జరిగింది క్లియర్ గా కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ మర్డర్. అంబటి రాంబాబు సహా అక్కడున్న వారిని చంపాలని ప్రయత్నం చేశారు. దానికి తగిన విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. కత్తులు, రాళ్లు, రాడ్లు వెంట తెచ్చుకున్నారు. కోర్టులో చేయాల్సింది చేస్తాం. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తాం. రాజ్యాంగబద్ధంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం.
ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే ఎవరిది పూచీ?
ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా? పోస్టర్ల వద్ద కర్రలు పట్టుకుని టీడీపీ నేతలు ఉన్నారు. అంబటి రాంబాబు ఆ మాట అనలేదు అన్నారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పోలీసులు అంబటికి నోటీసులు ఇవ్వాలి కదా? చట్టం కాపాడాల్సిన పోలీస్ ప్రేక్షకపాత్ర వహించారు. పెట్రోల్ సీసాలతో తగలబెడతారా పార్టీ ఆఫీస్ ని? ఎవరికైనా ప్రాణాపాయం జరిగితే ఎవరిది పూచీ? బొత్స సత్యనారాయణ డీజీపీతో సహా పోలీస్ అధికారులందరికీ ఫోన్లు చేశారు. మేము వస్తే ఇంకా టెన్షన్ పెరుగుతుందని రాలేదు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలుస్తాం, కేసులు వేస్తాం, కోర్టుల్లో తేల్చుకుంటాం.
పోలీసులతో సహా అందరినీ లాగుతాం..
భూమన కరుణాకరరెడ్డి, రజని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడులు జరిగాయి. పట్టాభి బూతులు మాట్లాడారు. కావాలని పదే పదే ఆ మాట అన్నారు. అది మా నాయకుడిని ఉద్దేశించే కదా? టీడీపీ స్టేట్ పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగింది. అది ఆవేశంలో జరిగింది. ఆరోజు పోలీసులు వెహికల్స్ తగలబెట్టారు.
నిన్న జరిగింది మర్డర్ చేయడానికే. టీడీపీ కార్యకర్తలు వచ్చారు. నిన్న జరిగిన సంఘటనలో ఎవరి పాత్ర ఉందో, పోలీసులతో సహా అందరినీ లాగుతాం. నిన్న గేటు బయట మా నాయకులను గుంటూరు ఎస్పీ వెయిట్ చేయించారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
Also Read: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్కినవి ఇవే..
