Circar Express Robbery : ఏపీలో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. ప్రయాణికుల బంగారం లాక్కునే యత్నం.. రంగంలోకి రైల్వే పోలీసులు.. ఆ బ్యాగుల్లో ఏముంది?

Circar Express Robbery : బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్పికట్ల - బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది.

Circar Express Theft Attempt in Bapatla District AP

Circar Express Robbery : ఏపీలోని బాపట్ల జిల్లాలో రన్నింగ్ రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. అప్పికట్ల – బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం తెల్లవారు జామున తమిళనాడులోని చెంగల్పట్టు నుంచి కాకినాడకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులోని s3, s6 బోగీల్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

అర్ధరాత్రి దాటిన తరువాత కావడంలో రైలులో అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఇదే సమయంలో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను బెదిరిస్తూ.. వారి వద్ద బంగారం, విలువైన వస్తువులను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ప్రయాణికులు దొంగలను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొందరు కేకలు పెడుతూ భయాందోళనకు గురయ్యారు. రైలులోని కొందరు ప్రయాణికులు అత్యవసర చైన్ లాగడంతో రైలు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో చీకటిని ఆసరాగా చేసుకున్న దొంగలు రైలు నుంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పటికే రైలులోని కొందరు ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగారు.

Also Read – West Bengal Politics : మమతాకు మరో షాక్‌.. జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌సీపీఐ.. అసలు ఎన్‌సీపీఐ ఎవరిది? టీడీపీని బీట్ చేయబోతుందా?

రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటన స్థలికి చేరుకొని దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చీకటి కావడంతో దొంగలు తేలికగా తప్పించుకునేందుకు అవకాశం లభించింది. అప్పటికే రైల్వే పోలీసులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. రైలులోని ప్రయాణికులు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికుల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

రైలులో ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. దోపిడీ యత్నానికి పాల్పడిన వారి ఆచూకీకోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదిలాఉంటే.. ప్రయాణికుల్లో బంగారం నగదు, విలువైన వస్తువులు దొంగలు దోచుకెళ్లారా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏడు తులాల బంగారం దోపిడీకి గురైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, రైల్వే పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా దుండగులకు సంబంధించిన రెండు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆ బ్యాగులో ఏముంది.. దుండగులకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది.