Anantapur Political Tension : అనంతపురంలో టెన్షన్ టెన్షన్.. ప్రకాశ్ రెడ్డి నివాసంలో పోలీసుల సోదాలు.. ఖాళీ బీర్ బాటిల్స్, రాళ్ల కుప్పలు..
Anantapur Political Tension : నగరంలో అరాచకాలు సృష్టించాలని ప్రకాశ్ రెడ్డి పథకం వేశారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు.
Anantapur Political Tension
Anantapur Political Tension : అనంతపురం పట్టణంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని.. లేదంటూ చెప్పుతో కొడతానంటూ ఎంఎస్ రాజు వైసీపీ నేత ప్రకాశ్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ శ్రేణులు తోపుదుర్తి నివాసంలో భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్, పల్లె రఘునాథ్ రెడ్డి, గుండుమల తిప్పెస్వామితోపాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు చేరుకోవటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
మరోవైపు.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నివాసంలో రాళ్లకుప్పలు, బీర్ సీసాలు ఉన్నాయని.. భారీ దాడికి స్కెచ్ వేశారని సమాచారం అందుకున్న పోలీసులు ఆయన నివాసంలో సోదాలు చేశారు. సోదాలు చేసేందుకు వెళ్లిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరి పోలీసులు ప్రకాశ్ రెడ్డి నివాసంలో తనిఖీలుచేయగా.. భారీగా ఖాళీ బీర్ సీసాలు, రాళ్ల కుప్పలు గుర్తించారు. వాటిని అక్కడి నుంచి పోలీసులు తొలగించేశారు.
నగరంలో అరాచకాలు సృష్టించాలని ప్రకాశ్ రెడ్డి పథకం వేశారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. అయితే, ప్రకాశ్ రెడ్డి తన నివాసంలో లేకపోవటంతో ఆయనకోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నలుమూలల నుంచి ఎమ్మెల్యే ఎం.యస్ రాజు ఇంటివద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రకాష్ రెడ్డికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే ఎం.యస్ రాజు పేర్కొన్నారు.. ఆలోపు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని అన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు.
