Krishna new tribunal : కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా? అనేదానిపై అభిప్రాయం చెప్పలేనన్న అటార్నీ జనరల్..

కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.? వద్దా.? అన్న దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారు. దీంతో కేంద్రం దీనికి సంబంధించిన ఫైల్ ను సొలిసిటర్ జనరల్ కు పంపింది.

Krishna new tribunal : కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.? వద్దా.? అన్న దానిపై అభిప్రాయం తెలిపేందుకు అటార్నీ జనరల్ వెంకటరమణి నిరాకరించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఏజీ అభిప్రాయం ఏంటో తెలపాలని కేంద్రం గతంలో కోరింది. అటార్నీ జనరల్ గా బాధ్యతలు చేపట్టేముందు ఏపీ తరపున న్యాయవాదిగా కేసుల్లో వాదించినందుకు అభిప్రాయం ఇవ్వలేనని తేల్చి చెప్పారు వెంకటరమణి. దీంతో అభిప్రాయం కోసం కేంద్రం దీనికి సంబంధించిన ఫైల్ ను సొలిసిటర్ జనరల్ కు పంపింది. తుషార్ మెహతా అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కేంద్రం కృష్ణా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ గురించి వివాదాలు ఏర్పాడ్డాయి. దీంతో కేంద్రాన్ని ఆశ్రయించారు. నదీ జలాల వినియోగంలో తమకు న్యాయం చేయాలని కోరాయి. ఈక్రమంలో కృష్ణా జిల్లాల విషయంలో కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది. కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశాకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టు కోరింది. కానీ దీనిపై కేంద్రం స్పందిస్తూ తెలంగాణ పిటీషన్‌ను ఉపసంహరించుకుంటే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది.దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకుంది.

దీంతో ప్రస్తుతం ఉన్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తోనే విచారిస్తే సరిపోతుందని కేంద్ర న్యాయశాఖ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీంతో కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు పంపించింది కేంద్రం. తుషార్ మెహతా అభిప్రాయం తరువాత కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇది ఏపీ తెలంగాణలకు కీలకంకానుంది.

 

ట్రెండింగ్ వార్తలు