బెయిల్ డ్రామా : పోలీసులపై జేసీ ఆగ్రహం

  • Publish Date - January 5, 2020 / 12:50 AM IST

అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌ నుంచి బయటికి వచ్చిన టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని.. పోలీసులు రిమోట్‌లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 2020, జనవరి 04వ తేదీ శనివారం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో లొంగిపోయేందుకు ఆయన వచ్చారు. బెయిల్‌ పత్రాలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయనను… ఏడు గంటలపాటు అక్కడే ఉంచడం టెన్షన్ పుట్టించింది. స్టేషన్‌ లోపల జేసీ, స్టేషన్‌ బయట ఆయన అనుచరులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఈ కేసుపై జేసీ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయండంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కండిషన్ బెయిల్ పత్రాలతో స్టేషన్‌కు వచ్చారు. అయితే సరైన పత్రాలు సమర్పించలేదని ఆయనను స్టేషన్‌లోనే ఉంచారు పోలీసులు. మధ్యాహ్న సమయంలో స్టేషన్‌కు వచ్చిన జేసీని సుమారు ఏడు గంటలపాటు స్టేషన్‌లోనే ఉంచారు.

మధ్యాహ్నం నుంచి నడిచిన ఈ డ్రామాకు రాత్రి 7గంటల ప్రాంతంలో ఎండ్‌కార్డ్‌ వేశారు పోలీసులు. జేసీ దివాకర్‌ రెడ్డి సమర్పించిన పూచీకత్తులను పరిశీలించిన అనంతరం ఆయనను విడుదల చేశారు. నెలకు రెండుసార్లు సమీప పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయలని కోర్టు జేసీ దివాకర్ రెడ్డిని ఆదేశించింది. 

జేసీ ఏమన్నారంటే : – 
జగన్ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని… తమ గవర్నమెంట్ వచ్చాక బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని జేసీ ఇటీవల వ్యాఖ్యానించారు. చంద్రబాబు సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర వివాదం చెలరేగింది. పోలీసు అధికారుల సంఘం ఓ రేంజ్‌లో ఫైరయ్యింది. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదుతో జేసీపై సెక్షన్ 153, 506 కింద కేసు నమోదైంది. 

పోలీసుల తీరును టీడీపీ  అధినేత చంద్రబాబు కూడా ఖండించారు. అయితే.. మొత్తంగా తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రతీకారంగా తమ పవర్‌ చూపించారు ఖాకీలు. తాము తలచుకుంటే ఎంతటివారికైనా ఏ గతి పడుతుందో చేసి చూపించారు. మరోసారి తమపై నోరుజారాలంటేనే జడుసుకునేలా చేశారు.

Read More : రాజధాని రగడ..19వ రోజు : రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు