Bapatla Current Shock : తీవ్ర విషాదం.. చెట్టెక్కి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు కరెంట్ షాక్, ఒకరు మృతి
బాపట్ల జిల్లా కొరిశపాడులో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టెక్కి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. చెట్టు మధ్యలో ఉన్న విద్యుత్ తీగలను గమనించని చిన్నారులు..
- Naveen
- Published On : January 22, 2023 / 06:32 PM IST
Bapatla Current Shock : బాపట్ల జిల్లా కొరిశపాడులో తీవ్ర విషాదం నెలకొంది. చెట్టెక్కి ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు విద్యుత్ షాక్ తగిలింది. చెట్టు మధ్యలో ఉన్న విద్యుత్ తీగలను గమనించని చిన్నారులు అక్కడున్న కొమ్మలను పక్కకు జరపబోయి విద్యుత్ తీగలను పట్టుకున్నారు. విద్యుత్ షాక్ తో ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దైవాలరావూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు బాదం చెట్టు ఎక్కారు. అయితే చెట్టు నుంచి విద్యుత్ తీగలు వెళ్లి ఉన్న విషయాన్ని పిల్లలు గుర్తించలేదు. ఆ విద్యుత్ తీగలు తగలడంతో వారికి కరెంట్ షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఒక బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. సరదాగా ఆడుకునేందుకు చెట్టెక్కిన బాలుడు ఇక లేడనే వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆదివారం కావడంతో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆడుకోవడానికి వెళ్లారు. స్థానిక సాయిబాబా గుడి దగ్గర ఉన్న బాదం చెట్టు ఎక్కారు. కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్న క్రమంలో కరెంట్ షాక్ కి గురయ్యారు. బాదం చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. ఆ ఆకుల మధ్య నుంచి విద్యుత్ తీగలు వెళ్లాయి. ఇది పిల్లలు గమనించలేదు. ఆడుకుంటూ కొమ్మలను పక్కకు జరపబోయిన పిల్లలు.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను పట్టుకున్నారు. దీంతో కరెంట్ షాక్ కొట్టింది.
Also Read..Youth stabbed to death: 18 ఏళ్ల కుర్రాడిని ఘోరంగా పొడిచి చంపిన ఇద్దరు మైనర్లు
ఈ ప్రమాదంలో ఒక బాలుడు స్పాట్ లోనే చనిపోయాడు. మరో బాలుడు చెట్టు మీద నుంచి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని గంటలు గడిస్తే కానీ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
