రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఏపీ సీఎం జగన్ కలయిక ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ముకేశ్ అంబానీకి టీడీపీ అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నాయనే మాట పాతదైపోయినట్లుగా కనిపిస్తుంది. జగన్ సీఎం అయ్యాక అంబానీని కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం హోదాలో ఉన్న జగన్‌ను అంబానీ కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించి చర్చలు జరిపారని చెబుతున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిద్దరి కలయిక పార్టీలోని రాజ్యసభ సభ్యత్వాలను ఆశిస్తున్న వారిలో గుబులు రేపుతోందని అంటున్నారు.
అంబానీ వెంట ఆయన తనయుడు అనంత్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానీ కూడా ఉన్నారు. నత్వానీ 2008 నుంచి 2సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మరోసారి ఆయన్ను పెద్దల సభకు పంపడం కోసమే జగన్‌ను అంబానీ కలిశారని చెబుతున్నారు. వైసీపీ తరపున నలుగురు రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్న తరుణంలో నత్వానీకి అవకాశం ఇవ్వాలని అంబానీ కోరారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి ఓ రాజ్యసభ సీటును బీజేపీ కోరిందనే వార్తలు ఇటీవల జోరందుకున్న విషయం తెలిసిందే. ఆ సీటును నత్వానీకి ఇవ్వాలని బీజేపీ కోరుతోందట.
ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించారని టాక్. దీనికి వైసీపీ అధినేత కూడా సుముఖంగానే ఉన్నారట. అందుకే నత్వానీ, అంబానీ వచ్చి జగన్‌ను కలిశారని అంటున్నారు. ఈ ప్రచారంతో వైసీపీలోని ఆశావహులకు బెంగ పట్టుకుందట. ఉన్న నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చేస్తే మిగిలిన మూడింటి కోసం ఎంత మంది పోటీ పడతారోననే ఆందోళన ఎక్కువైందని అంటున్నారు. ఇప్పటికే ఈ నాలుగు సీట్ల కోసం వైసీపీలో పోటీ తీవ్రంగా ఉంది.
ఓ పక్క శాసనమండలి రద్దు ప్రతిపాదనలు ఉండనే ఉన్నాయి. అదే జరిగితే చాలా మంది ఎమ్మెల్సీ పదవులు ఊడుతాయి. మంత్రులుగా ఉన్న ఇద్దరి ఎమ్మెల్సీ పదవులు కూడా పోతాయి. మరోపక్క, ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా చాలా మంది ఎమ్మెల్సీ పదవులిస్తామని జగన్ హామీలిచ్చారు. వారందరికీ ఇప్పుడు ఏదో అవకాశం తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. ఇదే సమయంలో మండలి రద్దుకు తీర్మానించడం.. అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండడంతో ఎమ్మెల్సీ ఆశావహుల్లో చాలా మంది దృష్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వంపై పడిందని అంటున్నారు.
నలుగురికి అవకాశం ఉంటే.. ఇప్పుడు నత్వానీకి ఒకవేళ కేటాయించాల్సి వస్తే.. మరో ముగ్గురికే అవకాశం ఉంటుంది. ఈ మూడింటి కోసం పార్టీలో చాలా మంది క్యూలో ఉన్నారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, బీదా మస్తాన్‌రావు, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చిరంజీవి, వైవీ సుబ్బారెడ్డి.. ఇలా పెద్ద జాబితాయే రెడీ ఉందంటున్నారు.
రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్న వారిలో ప్రతి జిల్లా నుంచి కనీసం ఒకరిద్దరైనా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి వారందరినీ జగన్ ఎలా మేనేజ్ చేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారిందంట. ఇప్పటికే పార్టీలో చాలా ప్రాంతాల్లో వర్గపోరు తీవ్రమైంది. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీ పడుతున్న వారికి అవకాశం రాకపోతే మరింత రచ్చ జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ముగ్గురికే అవకాశం ఇవ్వాల్సి వస్తే.. ఆ ముగ్గురు ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట. ఈ పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎదురు చూడాల్సిందేనని జనాలు అనుకుంటున్నారు.