Bhogi Festival 2026
Bhogi Festival 2026: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామునే భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు. ఇళ్ల ముందు, వీధుల్లో భోగి మంటలు వేసి పాత వస్తువులను కాల్చి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు. భోగి మంటల చుట్టూ చిన్నాపెద్దా ఆటపాటలతో సందడి చేస్తున్నారు.
భోగి పండుగకు ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యత ఎంతో ఉంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగిని జరుపుకుంటారు. పాతవి వదిలి కొత్తవి స్వీకరించడం ఈ పండుగ సారాంశం. ఇండ్లను శుభ్రం చేసి, పాత ఫర్నీచర్, దుస్తులు, అనవసర వస్తువులను భోగి మంటల్లో కాల్చడం ఆనవాయితీ. ఇది దరిద్రాన్ని తొలగించి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని ప్రజల నమ్మకం. గ్రామాలు, పట్టణాల్లో చిన్నారులు, యువత, పెద్దలు, మహిళలు తెల్లవారుజామునే భోగి మంటలు వేసుకొని.. భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు.